ప్రాంగణ నియామకాల (క్యాంపస్ ఇంటర్వ్యూ) వార్షిక సగటు వేతనంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్‌ఐటీ) దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ బీటెక్ నాలుగేళ్ల కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు సగటున రూ.29.53 లక్షల వార్షిక వేతనంతో కొలువులకు ఎంపికయ్యారు. ఆ తర్వాత ఐఐటీ కాన్పుర్ రూ.19.15 లక్షల సగటు ప్యాకేజీతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కళాశాలలకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అందులోభాగంగా 2018-19, 2019-20, 2020-21లో ప్రాంగణ నియామకాల సంఖ్య, వార్షిక సగటు వేతనం, ఉన్నత విద్యకు వెళ్లిన వారు తదితర వివరాలనూ తీసుకుంది. ఇంజినీరింగ్ విద్యలో 200 ర్యాంకుల వరకు ప్రకటించింది. ఆయా కళాశాలల్లో ప్రాంగణ ఎంపికల వార్షిక వేతన ప్యాకేజీ వివరాలను 'ఈనాడు' 'ఈటీవీ భారత్' పరిశీలించగా.. ట్రిపుల్‌ఐటీ తొలి స్థానంలో నిలిచింది. అక్కడ బీటెక్ పూర్తి చేసినవారికి 2018-19లో రూ.20 లక్షలు, 2019-20లో రూ.21 లక్షలు, 2020-21లో రూ.29.53 లక్షలు సగటు వేతనం లభించింది. అత్యధిక వేతనం రూ.56 లక్షలు. ఇక అయిదేళ్ల డ్యూయల్ డిగ్రీలో 2020-21లో రూ.24 లక్షలు, రెండేళ్ల పీజీకి రూ.18.70 లక్షల సగటు ప్యాకేజీ లభించింది.
వీరికే అత్యధికం ఎందుకు ?:ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచస్థాయి ప్రతిభావంతులను తయారు చేయాలన్న లక్ష్యంతో 1998లో 66 ఎకరాల విస్తీర్ణంలో గచ్చిబౌలిలో పీపీపీ విధానంలో ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ సంబంధిత కోర్సులు మాత్రమే ఉంటాయి. ఫీజులు, కన్సల్టెన్సీ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఈ విద్యా సంస్థ నడుస్తుంది. జేఈఈ మెయిన్ స్కోర్, కిశోర్ వైజ్ఞానిక ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై)తో పాటు సంస్థ నిర్వహించే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. అధిక ఫీజుల నేపథ్యంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తక్కువ మంది చేరుతుండటం గమనార్హం. పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కూడా ఇక్కడి విద్యలో భాగంగా ఉంటుంది. తద్వారా విద్యార్థులు లోతైన పరిజ్ఞానాన్ని సంపాదిస్తారని, అందుకే భారీ వేతనంతో కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయని ట్రిపుల్‌ఐటీ రిజిస్ట్రార్ కేఎస్ రాజన్ చెప్పారు.