ఓ వినూత్న ఆవిష్కరణతో ప్రతిష్ఠాత్మక ఇక్రిశాట్(ICRISAT in Hyderabad) మరో మైలురాయిని అధిగమించింది. జన్యు శ్రేణి విప్లవం దిశగా అతిపెద్ద ప్లాంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రయత్నం ద్వారా ఓ ఘనత సాధించింది. పరిశోధన, విస్తరణ సేవల్లో అంతర్జాతీయ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న ఇక్రిశాట్ అధ్యయనం విజయవంతమైంది. ప్రపంచంలో అత్యధికంగా సాగుచేస్తున్న పప్పుధాన్యాల పంటల్లో సెనగ(Chickpea crop in India)ది మూడోస్థానం. ఈ పంటపై హైదరాబాద్‌లోని ‘ఇక్రిశాట్’ ఆధ్వర్యంలో 41 అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు సంయుక్తంగా శోధించి సెనగ జన్యుపటాన్ని ఆవిష్కరించాయి. ఇందుకోసం 60కి పైగా దేశాల్లో ఈ పంట సాగుచేస్తున్న రైతుల నుంచి సేకరించిన.. 3,366 రకాల సెనగల(Chickpea crop in India)కు చెందిన జన్యువులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. మొత్తంగా 29,870 జన్యువులను గుర్తించి వాటితో పటాన్ని తయారుచేశారు. తద్వారా ఈ పంట ఎప్పటి నుంచి, ఏయే దేశాల్లో ఉందనే వివరాలు నమోదు చేశారు.
10వేల ఏళ్ల నుంచి ఉన్నాయి..
ఒక రకం సెనగలు(Chickpea crop in India) దక్షిణ, తూర్పు ఆసియా దేశాల నుంచి ప్రపంచదేశాలకు వెళ్లాయి. మరో రకం టర్కీ, మధ్య ఆసియా దేశాల నుంచి వ్యాపించాయి. తొలుత 12,600 ఏళ్ల క్రితం అడవుల్లో పెరిగిన ‘సిసెర్రీటిక్యులోటమ్’ అనే జాతి మొక్కల నుంచి సెనగలు వచ్చాయి. అలాగే పదివేల ఏళ్ల క్రితం నుంచి సెనగ మొక్కలున్నట్లు జన్యు పరిశోధనల్లో తేలింది. గత 400 ఏళ్లుగా వివిధ దేశాల్లో వీటి సాగు విస్తరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పెరుగుతున్న ప్రపంచ జనాభా ఆహార అవసరాలు తీర్చడానికి సెనగ కీలకపంట అవుతోందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
16 లక్షణాల గుర్తింపు..
భారత్‌లో శనగ పంట(Chickpea crop in India) దిగుబడులు భారీగా పెరగాల్సిన అవసరముందని ‘భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(Indian Council of Agricultural Research)’ డైరక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర చెప్పారు. అధిక దిగుబడులు ఇచ్చే మరిన్ని వంగడాల విడుదలకు దేశంలోని జాతీయ పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ పంట ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన 16 లక్షణాలను శనగ జన్యువుల్లో గుర్తించినట్లు ‘నేచర్’ పత్రికలో ప్రచురితమైన పరిశోధనాత్మక వ్యాసంలో శాస్త్రవేత్తలు వివరించినట్లు ఇక్రిశాట్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
మాంసానికి ప్రత్యామ్నాయం..
ప్రపంచంలో అత్యధికంగా పండించే చిక్కుళ్ల పంట రకాల్లో శనగ మూడోది. వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణహితం కాకుండా నేలలో నత్రజనిని స్థిరపరుస్తుంది. ఆహార, పోషకార భద్రతలో కీలక పాత్ర పోషిస్తూ బహుళ పోషక విలువ గల ఈ పంట మాంసానికి ప్రత్యామ్నాయమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతుంటారు. భారతదేశం ఈ పంటకు అతిపెద్ద ఉత్పత్తిదారు. దేశంలో శనగ వినియోగం కూడా అధికంగా ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి కావడం విశేషం. మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ ఉపయోగించడం ద్వారా సారవంతమైన నెల వంకలో శనగ వండగాల మూలం, చరిత్రను ధృవీకరించినట్లైంది.
రైతులకు ఉపయోగం ఈ అధ్యయనం..
ప్రపంచవ్యాప్తంగా... ప్రత్యేకించి భారతదేశంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో అధిక దిగుబడులు ఇచ్చే శనగ వండగాల(Chickpea crop in India) రూకల్పనలో ఈ జన్యు క్రమం విశ్లేషణ ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఏ జన్యువు ఎక్కడ ఉందీ...? ఎలా పనిచేస్తుంది...? ఏయే రకాల చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తాయి...? దిగుబడులు ఎలా ఉంటాయి...? పోషక విలువలు ఏ మోతాదులో ఉంటాయి...? అన్న అనేక అంశాలు క్రోడీకరించడం ద్వారా ఈ జన్యుక్రమం విశ్లేషించారు. వీటిలో మంచి జన్యువులు, చెడ్డ జన్యువులు కనుగొనడం ద్వారా... అధిక దిగుబడులు ఇచ్చే ఉత్తమ శనగ వండగాలు రైతులు వాడుకునేలా ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.