మార్చిలో హైదరాబాద్ వేదికగా జరగనున్న వింగ్స్ ఇండియాకు సంబంధించి రేపు దిల్లీలో సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించాలని పరిశ్రమలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆహ్వానించారు. ఈ మేరకు కేటీఆర్కు ఆహ్వానం పంపిన కేంద్రమంత్రి... వింగ్స్ ఇండియా కార్యక్రమం దేశ వైమానిక రంగాన్ని అంతర్జాతీయంగా ప్రముఖంగా నిలబెడుతుందన్నారు. దేశ వైమానిక రంగంలో తెలంగాణ పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చి 12 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికగా 'వింగ్స్ ఇండియా-2020' కార్యక్రమం జరగనుంది. కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వైమానిక సదస్సు కూడా నిర్వహించనుంది. సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎయిర్ లైన్స్, విమాన తయారీ సంస్థలు, కార్గో, స్పేస్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులు, పెట్టుబడిదారులు, వైమానిక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు.