Omicron Cases in Hyderabad : హైదరాబాద్ టోలిచౌకిలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడడంతో జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అప్రత్తమయ్యాయి. అక్కడ హైఅలర్ట్ ప్రకటించాయి. అధికారులు రంగంలోకి దిగి బాధితులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని అన్ని ప్లాట్లతోపాటు వాటికి అనుసంధానంగా ఉన్న మరికొన్నింటిలో నివాసితుల శాంపిళ్లు సేకరించి ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపారు. ఫలితాలు 24 గంటల్లోపు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సర్కార్ అలర్ట్..
Omicron Cases in Telangana : గురువారమూ వైద్య ఆరోగ్య శాఖ నుంచి 10-15 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. కాలనీలో మరిన్ని పరీక్షలు చేయనున్నాయి. బుధవారం కాలనీ మొత్తం క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారి చేశారు. బాధితులతో దగ్గరగా మెలిగిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. నగరంలో 30 సర్కిళ్లలో ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్నామని, ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుంటూ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నామని బల్దియా వెల్లడించింది.
ఎక్కడెక్కడ తిరిగారో..
Hyderabad Omicron Cases Today : కెన్యా, సోమాలియాకు చెందిన వ్యక్తులకు ఒమిక్రాన్ సోకినట్లు బయట పడటంతో ట్రేసింగ్, టెస్టింగ్, ఐసొలేషన్ ప్రక్రియ కీలకంగా మారనుంది. అనారోగ్య సమస్యలకు చికిత్స కోసం వచ్చిన బాధితులు నగరంలోని రెండు కార్పొరేట్ ఆసుత్రులకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల్లో ఎవరెవరిని కలిశారు.. ఎన్ని రోజులు గడిపారు.. ఎక్కడెక్కడ తిరిగారు.. అనేది చాలా ముఖ్యం. ఈ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం పెద్ద పరీక్షగా మారింది.