తొలి కరోనా కేసు నమోదైన గతేడాది మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 1,256 మంది గర్భిణులకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. నెలవారీ పరీక్షలు, ఇతర సంప్రదింపుల కోసం ఆసుపత్రులకు వెళ్లిన ఎంతోమంది గర్భిణులు కరోనా బారినపడ్డారు. ఇందులో నెలలు నిండిన వారూ ఉన్నారు. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరినవారికీ కరోనా సోకింది. తొలినాళ్లలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు అందుబాటులో లేక అన్ని జిల్లాల నుంచి గాంధీకు తరలించారు. కరోనా చికిత్సతోపాటు నెలలు నిండిన వెంటనే ప్రసవం పోశారు.
శిశువులకు సోకకుండా..
తల్లికి కరోనా వస్తే బిడ్డకూ ప్రమాదమే. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పుట్టిన బిడ్డకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నామని గాంధీ వైద్యులు తెలిపారు. నిలోఫర్ ఇతర బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాల సాయంతో బయట నుంచి తల్లి పాలు తెప్పించి వారికి అందించారు. ఈ క్రమంలో చికిత్సలు అందించే వైద్యులకూ కరోనా సోకింది. గైనకాలజీలో దాదాపు 10 మంది పీజీ వైద్య విద్యార్థులకు గతంలో కరోనా సోకింది. అయినా వెరవకుండా ఎంతోమంది తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడారు.