Hyderabad CP meeting with Bankers: సైబర్ దాడులు పెరుగుతున్నందున బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బ్యాంకుల సర్వర్లు హ్యాక్ అవ్వడానికి కారణం సైబర్ భద్రతకు సరైన నిధులు కేటాయించకపోవడమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు అర్బన్ కోపరేటివ్ బ్యాంకు అధికారులతో ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్... హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
ఈ సమావేశానికి సీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, నాబార్డ్, 51 అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు చెందిన అధికారులు హాజరయ్యారు. మహేష్ బ్యాంకు సర్వర్ హ్యాక్ చేసి సుమారు పన్నెండున్నర కోట్లను కొల్లగొట్టిన ఉదంతాన్ని సీపీ గుర్తు చేశారు. ఫిషింగ్ మెయిల్, ట్రోజన్స్, కీ లాగర్ సాఫ్టువేర్‌ల ద్వారా ప్రధాన డేటాబేస్‌లోకి ప్రవేశించి హాకింగ్‌కు పాల్పడిన విధానాన్ని వివరించారు. రెండు నెలల సుదీర్ఘమైన దర్యాప్తు చేపట్టి నైజీరియాకు చెందిన నలుగురు సూత్రధారులు సహా 23 మందిని అదుపులోకి తీసుకొని 3కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.