Mahesh Bank Server Hacking Case : మహేశ్ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్ చేసేందుకు సైబర్ నేరగాళ్లు పక్కా పథకం ప్రకారం కుట్ర పన్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు ఫిషింగ్ మెయిల్స్ పంపించి... వాటి ద్వారా సర్వర్‌లోకి చొరబడ్డారని వివరించారు. బ్యాంకు సిబ్బందికి నవంబర్‌లో 200 ఫిషింగ్ మెయిల్స్ పంపించారన్న సీపీ.. వారిలో ఇద్దరు ఫిషింగ్ మెయిల్స్‌ను తెరవడంతో హ్యాక్ అయిందని అన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని... ఈ కేసు దర్యాప్తునకు ఇప్పటికే రూ.58 లక్షలు ఖర్చయ్యాయని తెలిపారు.
అసలేం జరిగింది? : మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో కీలక నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సర్వర్‌ను హ్యాక్ చేసి 12 కోట్ల ఇతర ఖాతాలకు మళ్లించిన ఘటనలో ప్రధాన సూత్రధారిని పోలీసులు గుర్తించారు. జనవరి 23వ తేదీన మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసిన నిందితుడు పన్నెండు కోట్ల రూపాయలను.. నాలుగు ఖాతాల్లోకి మళ్లించాడు. ఆ తర్వాత అప్పటికే సిద్ధం చేసుకున్న మరో 128 ఖాతాలకు 12 కోట్లు మళ్లించాడు. సర్వర్‌లో నుంచి నగదు అక్రమంగా బదిలీ అయిన విషయం గమనించిన బ్యాంకు ప్రతినిధులు.. అప్రమత్తమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు బదిలీ అయిన విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సదరు బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లడంతో మూడు కోట్ల రూపాయలను బదిలీ కాకుండా నిలిపి వేయగలిగారు. 9 కోట్ల రూపాయలు మాత్రం సైబర్ నేరగాళ్లు పలు ఖాతాల నుంచి విత్ డ్రా చేసుకున్నారు.
"మహేశ్‌బ్యాంక్ సర్వర్‌లో లోపాలు ఉన్నాయి. వాటిని అసరా చేసుకొని నగదు బదిలీ చేసుకున్నారు. సర్వర్‌ను పకడ్బందీగా నిర్వహించడంలో మహేశ్‌బ్యాంక్ విఫలమైంది. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్‌కు 2 నెలల ముందే ఖాతాలు తెరిచారు. జనవరి 23న సర్వర్ హ్యాక్ చేసి 4 ఖాతాల్లోకి నగదు నిల్వలను పెంచేశారు. సదరు ఖాతాల నుంచి పలు బ్యాంక్‌లలోని 115 ఖాతాలకు బదిలీ చేశారు."