హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన న్యాయవాది కిశోర్ రాయ్.. గతేడాది డిసెంబరు 1న తన కుమార్తె పెళ్లిని ఘనంగా జరిపారు. అందులో భాగంగా తన అల్లుడి కోసం బంజారాహిల్స్ రోడ్ నంబరు4లో ఆరిజిన్స్ దుకాణంలో రూ.83 వేలతో షేర్వాణి, మరో ఐదు దుస్తులు కొనుగోలు చేశారు. పెళ్లయిన తర్వాత బరాత్ కోసం పెళ్లి కొడుకు... కొత్త షేర్వాణి వేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే భుజాల వద్ద షేర్వాణి చినిగి కనిపించడంతో.. నిరాశకు గురయ్యారు. మరోవైపు బరాత్ కోసం బందువులందరూ ఎదురు చూస్తుండటంతో.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పెళ్లి కొడుకు సోదరుడు సమీపంలోని ఓ దుకాణానికి వెళ్లి మరో డ్రెస్ కొనుగోలు చేసి.. బరాత్ అయిందనిపించారు.
స్పందించని దుకాణ యాజమాన్యం
షేర్వాణి చినిగి ఉండటం.. పెళ్లి బృందంలో అందరినీ ఇబ్బంది పెట్టింది. దీంతో బంధువుల ముందు కిశోర్ రాయ్‌కి అవమానకరంగా, ఇబ్బందిగా అనిపించింది. రెండు రోజుల తర్వాత డిసెంబరు 3న తనకు చినిగిన షేర్వాణి ఇచ్చినందుకు.. ఆరిజిన్స్ యజమానికి లీగల్ నోటీసు ఇచ్చారు. షాపు యాజమాన్యం నోటీసులకు స్పందించలేదు. దీంతో తాను చెల్లించిన రూ.83వేలతో పాటు... రూ.10లక్షలు పరిహారం చెల్లించేలా ఆరిజిన్స్ను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ జిల్లా మూడో వినియోగదారుల ఫోరాన్ని కిశోర్ ఆశ్రయించారు. వివరణ ఇవ్వాలని వినియోగదారుల ఫోరం నోటీసులు పంపించినప్పటికీ.. ఆరిజిన్స్ నుంచి స్పందన రాలేదు. కిశోర్ సమర్పించిన పలు ఆదారాలు, కొత్త వినియోగదారుల చట్టంలోని పలు సెక్షన్లను పరిశీలించిన వినియోగదారుల ఫోరం తీర్పు వెల్లడించింది.