హైదరాబాద్ నగరంలోని 20 రద్దీ కూడళ్లను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. రద్దీ కూడలిలో లాక్‌డౌన్ లేని సమయంలో గరిష్ఠంగా ఒకవైపు వెళ్లిన వాహనాల సంఖ్యకు, లాక్‌డౌన్ ఉన్నప్పుడు వాహనాల సంఖ్యను పోల్చారు. సాధారణ రోజుల్లో రద్దీ సమయంలో ఒకవైపు వెళ్లిన వాహనాలు 10వేలు ఉంటే అందులో ఐదు శాతం నుంచి 30శాతం వరకు వాహనాలు మాత్రమే వెళ్లాలని లెక్కకట్టారు. అంతకుమించి వాహన రద్దీ ఉంటే ఆ కూడళ్ల వద్ద ప్రత్యేక బృందాలు ఉంటాయి. వచ్చిన ప్రతి వాహనదారుడిని ఆరా తీసి.. సరైన కారణం చెప్పకపోతే కేసులు నమోదు చేస్తాయి.
ప్రత్యక్ష పరిశీలన
వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసు సహాయ వాణికి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై చర్యలు చేపట్టేందుకు బషీర్‌బాగ్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. కెమెరాల ద్వారా అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ అధికారులు, సిబ్బందికి సూచనలిస్తున్నారు. వారు స్పందించి నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనాల రాకపోకలను కట్టడి చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు తెలిపారు.