తెలంగాణ

telangana

ETV Bharat / city

హరించుకుపోతున్నహెచ్​సీయూ భూములు.. ఆందోళనలో విద్యార్థులు - Hyderabad Central University

దేశంలోనే పేరొందిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ(హెచ్‌సీయూ) భూములు హారతి కర్పూరంలా హరించుకు పోతున్నాయి. ఇప్పటికే వర్సిటీకి చెందిన 1104.42 ఎకరాల భూమిని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు కేటాయించారు. ఇటీవల ప్రహరీని కూల్చి లోపల బలవంతంగా రోడ్డు వేయడం వివాదాస్పదమైంది. మరిన్ని కేటాయింపులకు రంగం సిద్ధమవుతోందన్న ఆందోళన రేగుతోంది.

Hyderabad Central University lands are allocated to government agencies
హరించుకుపోతున్నహెచ్​సీయూ భూములు

By

Published : Jan 18, 2021, 10:33 AM IST

● 1975లో కేంద్రం హెచ్‌సీయూని ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2324 ఎకరాలను కేటాయించగా, రెండేళ్లలో ప్రహరీ నిర్మించారు.

● 1977 నుంచి ఈ భూములపై నాటి సర్కారు కళ్లు పడ్డాయి. అదే ఏడాది ఆర్టీసీ బస్‌డిపో, ఏపీఎస్‌ఈబీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలకు భూములు కేటాయించింది. తరువాత అనేక సంస్థలకు ఇక్కడే భూములిచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం 134.28 ఎకరాలు, ఐఎంజీ భరత అనే ప్రైవేటు సంస్థకు 400 ఎకరాలు కేటాయించారు. ఇలా మొత్తం మీద 1104.42 ఎకరాలను నాటి రాష్ట్ర సర్కారు ధారాదత్తం చేసింది. ఐఎంజీ భరతకు భూముల కేటాయింపు వివాదాస్పదమైంది. దీంతో అప్పటి ప్రభుత్వం ఐఎంజీకి మరో చోట 400 ఎకరాలను కేటాయించింది. మొత్తం మీద 704 ఎకరాలు ఇతర సంస్థల చేతుల్లో ఉన్నాయి.

ప్రహరీని కూల్ఛి..

వర్సిటీ భూముల్లో రూపుదిద్దుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కాలనీకి దారి కోసం కొంత స్థలం ఇవ్వాలని వర్సిటీ అధికారులను కోరగా నిరాకరించారు. విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నా లెక్క చేయకుండా విశ్వవిద్యాలయ ప్రహరీని ఇటీవల బలవంతంగా కూల్చివేశారు. కి.మీ.కుపైగా పొడవున 18.3 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రికి రాత్రే చదును చేసి మూడు రోజుల వ్యవధిలో తారు రోడ్డు నిర్మించారు. వర్శిటీ అధికారులు దీనిపై హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్‌కో ఇచ్చింది.

రికార్డుల్లో ఇప్పటికీ సర్కారీ భూములే!

హెచ్‌సీయూ కోసం 2324 ఎకరాల భూమిని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ వర్సిటీ పేరిట మ్యుటేషన్‌ చేయలేదు. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ఇప్పటికీ ప్రభుత్వానిదిగానే ఉంది. ఈ విషయమై విశ్వవిద్యాలయ అధికారులు నాలుగైదుసార్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలకు చెందిన భూములను కేంద్ర కేబినెట్‌ సెక్రెటరీ అనుమతి లేకుండా ఎవరికీ కేటాయించడానికి వీల్లేదంటూ కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినా హెచ్‌సీయూకి చెందిన 18.3 ఎకరాలను ఏకపక్షంగా కేటాయించడంపై పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై మాట్లాడటానికి వర్సిటీ ఉన్నతాధికారులు సుముఖత చూపలేదు.

ప్రభుత్వ భూమి కావడం వల్లే..

హెచ్‌సీయూ అధీనంలోని భూములన్నీ ప్రభుత్వ భూములే. అందువల్లే కొంత భూమిని రోడ్డుకు కేటాయించాం. దీనిపై వివాదం చేయాల్సిన అవసరం లేదు.

చంద్రకళ, ఆర్డీవో, రాజేంద్రనగర్

సంస్థల వారీగా హెచ్‌సీయూ భూముల కేటాయింపు- ఎకరాల్లో

ఐఎంజీ భరత 400 (తరవాత వెనక్కి తీసుకున్నారు)

టీఎన్‌జీవోలకు 134.28

స్పోర్ట్స్‌ అథారిటీకి 117.13

తహసీల్దారు, ఇతరుల కోసం 9

రంగారెడ్డి జిల్లా కేంద్రం కోసం 62

(ఈ భూములను ఐఐఐటీకి ఇచ్చారు)

మొత్తం 1104.42 ఎకరాలు

టీఐఎఫ్‌ఆర్‌ 191.01

ఎన్‌ఐడీ 30

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ 100

ఎనర్జీ రిసోర్సు ఇన్‌స్టిట్యూట్‌ 40

ఇతరులు 21

ABOUT THE AUTHOR

...view details