ఎన్నికల వేడి నుంచి భాగ్యనగరానికి ఉపశమనం లభించింది. నిన్న, మొన్నటి వరకు ఎన్నికల గురించి, పార్టీల గెలుపోటముల గురించి మాట్లాడుకున్న నగరవాసులు శనివారం సాధారణ జీవనంలోకి జారుకున్నారు. ఇన్ని రోజులపాటు తీరిక లేకుండా గడిపిన రాజకీయపార్టీల నేతలు, అధికారులు సైతం విశ్రాంతి పొందారు. ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు, కూడళ్లు సైతం యథాతథ స్థితికి చేరుకున్నాయి. గోడలు, స్తంభాలపై కట్టిన పార్టీల జెండాలు, ఫ్లెక్సీలు, కాగితాలు, గోడపత్రాలు, ఇతరత్రా ప్రచార సామగ్రిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
ఎన్నికల వేడి నుంచి భాగ్యనగరానికి ఉపశమనం.. - greater elections 2020 ended
గ్రేటర్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో నగర వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది. నువ్వా..నేనా అన్నట్లుగా సాగిన ప్రచార ర్యాలీలు, ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, స్వల్ప ఉద్రిక్తతలు, గెలుపు సంబరాలు ముగియడంతో భాగ్యనగరం మళ్లీ మునుపటి స్థితికి వచ్చింది.
జీహెచ్‌ఎంసీ-2020 ఎన్నికల నోటిఫికేషన్ నవంబరు 18న విడుదలైంది. ఆ రోజు నుంచే నియమావళి అమల్లోకి వచ్చింది. ఫలితంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బాలానగర్ కూడలి నుంచి నర్సాపూర్ రోడ్డు వైపు నిర్మిస్తోన్న ఎలివేటెడ్ కారిడార్, టోలీచౌకీ పైవంతెన, ఎల్బీనగర్ కూడలి చుట్టూ జరుగుతోన్న పైవంతెనల పనులు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం తదితర పనులు స్తంభించాయి. టెండర్ల దశలోని పనులూ నిలిచిపోయాయి.
ఎన్నికల నిర్వహణకు తక్కువ వ్యవధి ఉండటంతో అధికారులంతా మిగిలిన పనులన్నింటినీ పక్కనపెట్టి కేవలం ఏర్పాట్లపైనే దృష్టిపెట్టారు. డిసెంబరు 4న ఫలితాలు ప్రకటించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. నివేదికల తయారీ, ఇతరత్రా పనులు పూర్తయితే మరింత ఉపశమనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. సోమవారం ఎన్నికల నియమావళిని ఎత్తేసే అవకాశం ఉందని, అనంతరం అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తామని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో తెలిపారు.