తెలంగాణ

telangana

ETV Bharat / city

Hussain Sagar Hyderabad News : కోట్లు ఖర్చు చేసినా.. ఏళ్లు గడుస్తున్నా.. మారని సాగర్ కథ - hussain sagar cleaning

Hussain Sagar Hyderabad News : హుస్సేన్​సాగర్​.. హైదరాబాద్​ వాసులు మెచ్చే ప్రాంతాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. సాగర్ తీరమంతా ఊహించని విధంగా సర్వాంగ సుందరంగా ముస్తాబై సందర్శకులను కనువిందు చేస్తోంది. కానీ సాగర్ కథే మారలేదు. వేల కోట్లు ఖర్చు చేసినా.. సాగర్​ మురుగు వీడలేదు. విదేశీ సాంకేతికతలెన్ని తెచ్చినా ఆ దుర్వాసన పోలేదు. అసలు అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని.. వారి నిర్లక్ష్యం వల్లే సాగర్ ఇంకా అలాగే ఉందని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు.

Hussain Sagar, Hussain Sagar news
Hussain Sagar

By

Published : Nov 30, 2021, 7:35 AM IST

‘‘హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌ అందంగా ఉంటుందని విని డ్రైవర్‌ను తీసుకెళ్లమన్నాను. అక్కడ అంతా బాగున్నా.. దుర్వాసన కారణంగా ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయాను.’’

-హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ

Hussain Sagar Hyderabad News : సాగర్‌ చుట్టూ తీరం ఊహించని విధంగా మారింది. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్డు కొత్తందాలు అద్దుకొని మెరిసిపోతున్నాయి. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) చేపట్టిన సుందరీకరణ పనులతో నగరవాసుల ఆహ్లాదానికి ఈ ప్రాంతం ఇప్పుడు చిరునామాగా మారింది. కానీ.. సాగర్‌ కథే ఏం మారలేదు.. సుమారు రూ.300కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసినా.. విదేశీ సాంకేతికతలెన్ని తెచ్చినా మురుగు వీడలేదు. ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) నియమించిన నలుగురు నిపుణుల కమిటీ సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి ఇదే విషయాన్ని కుండబద్దలుకొట్టింది. అసలు మురుగు ఆపకుండా పైపై మెరుగులుదిద్దుతున్నారని పర్యావరణవేత్తల నుంచి విమర్శలొస్తున్నాయి.

రసాయన వ్యర్థాలతో..?

Hussain Sagar Cleaning : ఏళ్లుగా సాగర్‌ కాలుష్యానికి ప్రధాన హేతువు పారిశ్రామిక వ్యర్థ జలాలే. ఇందులో ప్రధానంగా బాలానగర్‌, జీడిమెట్ల, పాశమైలారం పారిశ్రామికవాడల నుంచి విషాన్ని మోసుకొస్తున్న కెమికల్‌ నాలాకు అడ్డుకట్టేసి.. రోజువారీగా 500ఎంఎల్‌డీ పారిశ్రామిక వ్యర్థజలాలు సాగర్‌లో చేరకుండా రూ.56కోట్లతో హెచ్‌ఎండీఏ మళ్లింపు పనులు పూర్తి చేసింది. 2200 డయా వ్యాసార్థమున్న పైపులైన్‌ ద్వారా అంబర్‌పేట మరుగు శుద్ధి ప్లాంటు(ఎస్టీపీ)కు తరలించి అక్కడ శుద్ధి చేసి మూసీలోకి విడుస్తున్నారు. పైపులైన్‌ సామర్థ్యం తక్కువగా ఉండటంతో ప్రవాహం పెరిగినప్పుడు 30-40శాతం యథావిధిగా సాగర్‌లోనే కలుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఘాటువాసనలు వెలువడటంతోపాటు కోట్ల రూపాయలు మురుగుపాలవుతున్నట్లు కమిటీ తేల్చింది. మరోవైపు కూకట్‌పల్లి, బుల్కాపూర్‌, పికెట్‌, బంజారా నాలాల్లో ఎంత మురుగు వస్తోంది..? ఎంత కలుస్తోందనే లెక్కలు లేకపోగా.. మీటర్లూ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

అడుగున చెత్త అలాగే

Tank Bund News : సాగర్‌ గర్భంలో దశాబ్దాలుగా సుమారు 40లక్షల టన్నుల ఘన వ్యర్థాలు పోగుపడి ఉన్నట్లు నిపుణుల అంచనా. రెండేళ్లుగా నాలాల వద్ద వ్యర్థాలు తొలగించారు. సుమారు 5లక్షల టన్నుల వ్యర్థాలు మాత్రమే తొలగించినట్లు సమాచారం. వాటిని గాజులరామారం క్వారీలకు తరలించారు. మిగిలిన 35లక్షల టన్నుల ఘన వ్యర్థాలు సాగర గర్భంలోనే మిగిలిపోవడంతో ప్రక్షాళన పర్వం ప్రహసనంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

హమ్మయ్య.. ఊపిరొచ్చింది!

Hussain Sagar Cleaning Work : జలాల స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు చేపట్టిన బయో రెమిడియేషన్‌ విధానంలో బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేస్తోంది. కొన్నేళ్లుగా ఈ ప్రక్రియతో సాగర్‌లో ఆక్సిజన్‌ మోతాదు గణనీయంగా పెరిగినట్లు పీసీబీ తేల్చింది. దీంతో పలు జీవరాశులు పెరిగేందుకు దారి దొరికిందని తెలిపింది.

బీవోడీ మారలేదు

ఆక్సిజన్‌ మోతాదు పెరగడం ఊరటనిచ్చినా.. బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ మోతాదు ప్రతి లీటరు నీటిలో 22 మిల్లీ గ్రాములుగా నమోదైనట్లు పీసీబీ తాజా నివేదిక తెలిపింది. పీసీబీ ప్రమాణాల మేరకు బీవోడీ 3 మిల్లీగ్రాములు ఉండాలి. ఇటీవల వర్షాలకు కూకట్‌పల్లి నాలా నుంచి వచ్చి సాగర్‌లో వచ్చి చేరిన పారిశ్రామిక కాలుష్య జలాలతో మోతాదు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడెప్పుడు.. ఎంతెంత..?

2006లో రూ.270కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు

2014లోరూ.56కోట్లతో కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులు

2015లోజీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎక్స్‌కావేటర్‌తో వ్యర్థాల తొలగింపు

2017లో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ స్థాయి పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్‌ సంస్థ శాటిలైట్‌ ఆధారిత సాంకేతికత వినియోగంసాగర్‌ ప్రక్షాళనకు చేసిన వ్యయం దాదాపు రూ.326కోట్లు.

ABOUT THE AUTHOR

...view details