రాష్ట్రంలో మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ సాయంత్రం 7 గంటల వరకు 60 వేలకుపైగా వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ (Liquor Tenders in telangana) అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 34 ఎక్సైజ్ జిల్లాల పరిధిలో ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొత్తం 2620 మద్యం దుకాణాలకు 60,433 దరఖాస్తులు అందాయి. ప్రతి దరఖాస్తుకు రెండు లక్షలు రూపాయిలు నాన్ రిఫండ్‌బుల్ మొత్తం ఎక్సైజ్ శాఖకు (Liquor Tenders in telangana) రాబడిగా వస్తుంది. దీంతో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల ద్వారా 1,200 కోట్లకుపైగా మొత్తం ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. ఒక్కో దుకాణానికి సగటున 23 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఖమ్మం జిల్లాల్లో 122 మద్యం దుకాణాలకు 6,084 దరఖాస్తులు రావడంతో ఒక్కో దుకాణానికి అత్యధికంగా (Liquor Tender applications) 50 దరఖాస్తులు వచ్చినట్లయింది. కొత్తగూడెం ఎక్సైజ్ జిల్లాల్లో 88 మద్యం దుకాణాల కోసం ఇప్పటి వరకు 3,699 దరఖాస్తులు రావడంతో ఒక్కో దుకాణానికి 42 వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెద్దపల్లి ఎక్సైజ్ జిల్లాలో 77 మద్యం దుకాణాలకు కేవలం 849 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా నిర్మల్ ఎక్సైజ్ జిల్లాలో 47 మద్యం దుకాణాలకు 524 దరఖాస్తులు వచ్చాయి. ఈ రెండు జిల్లాల్లో ఒక్కో మద్యం దుకాణానికి సగటున 11 దరఖాస్తులు అందినట్లు అధికారులు వివరించారు. దరఖాస్తులకు సంబందించి.. పూర్తి వివరాలు రావాల్సి ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ ఉన్నతాధికారులు తెలిపారు.