తెలంగాణ

telangana

ETV Bharat / city

అప్పుడు ఆనందం నింపిన వాడే.. చివరికి కన్నీళ్లు మిగిల్చాడు - rain effect in telangana

కాలం కలిసొచ్చిందని సంబరపడ్డ అన్నదాతల ఆశలను... ప్రకృతి అడియాసలు చేసింది. భారీ వర్షాలు మరోసారి రైతుల వెన్ను విరిచాయి. పంట పొలాల్లోకి చేరిన వరదనీరు.. రైతన్నలను కన్నీరు పెట్టిస్తోంది. చేతికందివచ్చిన వరి నీటి పాలైంది. కాయ పూత దశలో ఉన్న పత్తి.. భారీ వానలకు నేలరాలింది.

loss to farmer
అప్పుడు ఆనందం నింపిన వాడే.. చివరికి కన్నీళ్లు మిగిల్చాడు

By

Published : Oct 15, 2020, 5:22 AM IST

అప్పుడు ఆనందం నింపిన వాడే.. చివరికి కన్నీళ్లు మిగిల్చాడు

వానాకాలం ఆరంభం నుంచే అన్నదాతల కళ్లలో ఆనందాన్ని నింపిన వర్షాలు.. చివరికి కన్నీటిని మిగిల్చాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేలాది మంది రైతులు పంటలు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లారు. భద్రాద్రి జిల్లాలో అధికారుల అంచనా ప్రకారం 23 మండలాల్లో 4వేల 126 మంది రైతులు నష్టపోయారు. 7వేల 53 ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది.

ఖమ్మం జిల్లాలో 53 వేల 358 మంది రైతులు...76 వేల 819 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 20 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో పత్తి, పెసర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అందులో నుంచి తేరుకోకముందే మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తాయి. చేతికందివచ్చిన పంటను పోగొట్టుకుని నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఆగస్టులో 10 రోజుల పాటు కురిసి.. రైతులకు దుఖాన్ని మిగిల్చిన వర్షాలు.... రెండు నెలల వ్యవధిలోనే మరోసారి పిడుగులా విరుచుకుపడ్డాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో.. మొత్తం 9వేల 417 ఎకరాల్లో వరి నీట మునిగింది. 2వేల 503 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. మొత్తం 11వేల 952 ఎకరాల మేర నష్టం జరిగిందని.. వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. 8 వేల 451 మంది రైతులు... వర్షాల వల్ల నష్టపోయినట్లు లెక్కలు తీశారు.

గ్రామీణ జిల్లాలోనూ మొత్తం 61 వేల 720 ఎకరాల మేర పంటలకు నష్టవాటిల్లినట్లు తేలింది. ఇందులో.. 5వేల 671 ఎకరాలు వరి, 55 వేల 438 ఎకరాల మేర పత్తి నీట మునిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట...కళ్లముందే నీటమునగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో మిగిలారు.

జనగామ జిల్లాలోనూ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 16 వేల 673 ఎకరాల్లో వరి పంట నీట మునగ్గా... 10 వేల 15 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. మహబూబూబాద్ జిల్లాలో 1620 ఎకరాల్లో పత్తి, 2 వేల 590 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం నాలుగు జిల్లాల్లోనూ...800 ఎకరాల్లో కంది, మిర్చి, పెసర, సోయా, వేరుశనగ పంటలు వర్షానికి నీట మునిగాయి. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే. గతంలో జరిగిన నష్టానికి అధికారులు లెక్కలు తీసుకున్నారు కానీ....ఎలాంటి సాయం అందించలేదు. ఈసారైనా తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతన్న కోరుతున్నాడు.

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు... పెద్దఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. సూర్యాపేట జిల్లాలో భారీగా పంట నష్టం సంభవించింది. సంగారెడ్డి జిల్లాలో కంగ్టి, నారాయణ ఖేడ్, మనూరు, సిర్గాపూర్, కల్హేర్‌ మండలాల్లో పంటలు నీటమునిగాయి. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో కూరగాయల పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఇవీచూడండి:భారీ వర్షాలు... కోతకొచ్చిన పంట నీటిపాలు

ABOUT THE AUTHOR

...view details