72 ఏళ్ల వయసులో భర్త ఆమెను అద్దె ఇంట్లో తాళం పెట్టి వెళ్లిపోయాడు. ఎనిమిది నెలలైంది. ఇప్పటికీ రాలేదు. అ వృద్ధురాలి దీనావస్థ చూడలేక ఆమె ఉండే ఇంటి యజమానురాలు కిటీకిలోంచి ఆహారం అందిస్తూ, తరచూ పలకరిస్తున్నారు. మరో సంఘటనలో... ఓ అనుమానపు భర్త భార్యను రోజూ చిత్రహింసలు పెడుతున్నాడు. అనుమానంతో ఆమె తల పగులగొట్టాడు. శరీరంపై ఇనుపకడ్డీతో వాతలు పెట్టాడు.
వీరు భర్తలు కాదు.. రాక్షసులు.. ఎనిమిది నెలలుగా ఇంట్లో బందీగా వృద్ధురాలు
వీధి మొహం చూడకుండా నాలుగు గోడల మధ్య... ఎనిమిది నెలలుగా.. తాళం వేసిన ఇంటిలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతోందామె. లోపల తిండి లేదు. కరెంటు లేదు. కనీసం మంచినీళ్లు కూడా లేవు. ఎనిమిది నెలల కిందట ఇల్లు తాళమేసి వెళ్లిపోయిన భర్త ఎప్పుడొస్తాడో తెలియదు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ గణేశ్‌నగర్ ఇంటి నంబర్ 1-9-129/23/సీ/83 మొదటి అంతస్తులో ఏడాదిన్నర క్రితం గంగాధర్, ఆయన భార్య బేబితో అద్దెకు దిగారు. కృష్ణా జిల్లా నాగాయలంక వీఆర్వోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందానని, తమకు పిల్లలు లేరని ఇంటి యజమానురాలు శారదకు చెప్పారు. అప్పటి నుంచీ ఆయన బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసి వెళ్లేవాడు. ఒక్కోసారి రెండుమూడు రోజులు గడిచినా.. ఇంటికి వచ్చేవాడు కాదు. ఇంటి యజమానులే వృద్ధురాలిని బయటి నుంచి పలకరించేవారు. అవసరమైతే అన్నం పెట్టేవారు. ఆంధ్రప్రదేశ్‌లో తన భూమి విక్రయించి వస్తానని చెప్పి గత జులై మొదటి వారంలో వెళ్లిన గంగాధర్ నేటికీ తిరిగి రాలేదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. మూడు నెలల కిందట ఒకసారి ఫోన్ చేసి.. త్వరలో వస్తున్నా.. అన్నట్టు ఇంటి యజమానురాలు తెలిపారు. అద్దె కట్టడం రెండు రోజులు ఆలస్యమైతేనే ఒప్పుకోని నేటి పరిస్థితుల్లో ఎనిమిది నెలలుగా అద్దె లేకున్నా, ఆ వృద్ధురాలికి అన్నం పెట్టి ఆదుకుంటున్నారు శారద. తమకూ కష్టాలున్నా శారద ‘మాకు ఏ జన్మలో రుణమో’ అంటూ మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. తన భర్త ఎప్పుడొస్తారా అని వృద్ధురాలు బేబి ఆశ, ప్రేమ చావని కళ్లతో ఎదురు చూస్తున్నారు.
భార్యకు చిత్రహింసలు..
వనపర్తి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఉపాధి కోసం హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఇటీవల ఆమెపై భర్తకు అనుమానం పెరిగి రోజూ వేధించేవాడు. రెండు రోజుల కిందట తలపై బలంగా కొట్టాడు. మాడు పగిలి రక్తం ధార కట్టింది. అంతటితో ఆగక.. వివస్త్రను చేసి శరీరంపై ఇనుపకడ్డీతో వాతలు పెట్టాడు. ఆ దృశ్యాలను తన 14 ఏళ్ల కుమారుడితో సెల్‌ఫోన్లో చిత్రీకరింపజేశాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంట్లోంచి తప్పించుకుని వనపర్తి పోలీసులను ఆశ్రయించిందామె. పోలీసులు ఆమెకు ప్రాథమిక చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి పంపారు. సంఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసు ఠాణా పరిధిలో జరిగినందున కేసును అక్కడికి బదలాయించినట్లు చెప్పారు.