తెలంగాణ

telangana

ETV Bharat / city

బాబాకు బంగారు కిరీటం.. 88 ఏళ్ల వయసులో భార్య కోరిక నెరవేర్చిన భర్త.. - బాబాకు బంగారు కిరీటం

ముప్పై ఏళ్ల క్రితం అనుకోకుండా జరిగిన పరిణామం.. ఆ క్షణంలో భార్య ముఖంలో కనిపించిన కోరిక.. అంతలోనే ఆమె హఠాణ్మరణం.. అప్పటి నుంచి ఆ భర్త మనసులోనే ఆ కోరిక నాటుకుపోయింది. కట్​ చేస్తే.. 88 ఏళ్ల వయసులో బాబాకు 40 లక్షల విలువైన బంగారు కిరీటం సమర్పించాడు. అసలు ముప్పై ఏళ్ల క్రితం ఏం జరిగింది..? ఆదర్శ భర్తగా నిలిచిన ఆ సాయి భక్తుడెవరంటే..?

husband fulfilled wife last wish of Golden crown for Baba at the age of 88
husband fulfilled wife last wish of Golden crown for Baba at the age of 88

By

Published : Jul 22, 2022, 5:11 PM IST

Updated : Jul 22, 2022, 5:22 PM IST

బాబాకు బంగారు కిరీటం.. 88 ఏళ్ల వయసులో భార్య కోరిక నెరవేర్చిన భర్త..

భార్య ఏదైనా కోరిక కోరితే.. "చూద్దాంలే.. చేద్దాంలే.. అది మన తాహతుకు మించింది.. మన వల్ల కాదు.. మనకవసరమా.." అంటూ వాయిదాలు వేస్తూ తప్పించుకునే భర్తలున్న ఈ రోజుల్లో.. చనిపోకముందు అర్ధాంగి కోరిన ఓ ఖరీదైన కోరికను మర్చిపోకుండా ఏకంగా ముప్పై ఏళ్ల తర్వాత.. 88 ఏళ్ల వయసులో నెరవేర్చాడు ఈ భర్త. సహధర్మచారిణి చివరికోరికను తీర్చేందుకు నిరంతరం శ్రమించి.. పైసాపైసా కూడబెట్టి.. షిరిడీ సాయికి 40 లక్షల రూపాయల విలువైన 742 గ్రాముల బంగారు కిరీటాన్ని సమర్పించారు హైదరాబాద్​కు చెందిన డాక్టర్​ రామకృష్ణ.

డాక్టర్​ రామకృష్ణ, రత్నమాంబ దంపతులు గతంలో హైదరాబాద్​లో ఉండేవారు. డా. రామకృష్ణ.. గాంధీ ఆస్పత్రిలో సర్జన్​గా విధులు నిర్వహించారు. ఉద్యోగ విరమణ అనంతరం పలు వైద్యకళాశాలల్లో ప్రొఫెసర్​గా, డీన్​గా పనిచేశారు. రామకృష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలుండగా... వాళ్లంతా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన కూడా ప్రస్తుతం వాళ్లతో కలిసి అమెరికాలోనే ఉంటూ.. కాలిఫోర్నియా యూనివర్సిటీలో డీన్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. పిల్లలతోసహా వచ్చి షిరిడీ సాయికి బంగారు కిరీటాన్ని సమర్పించారు. దీంట్లో ఏముంది అనుకుంటున్నారా..? అయితే.. 1992లో రామకృష్ణ దంపతులకు జరిగిన ఓ సన్నివేశం తెలుసుకోవాల్సిందే..!

1992లో ఒకసారి కుటుంబంతో కలిసి సాయిబాబా దర్శనం కోసం షిరిడీకి వెళ్లారు. సాయి హారతి సమయంలో అనుకోకుండా అక్కడున్న పూజారి.. బాబాకు అలంకరించిన కిరీటాన్ని తీసి రత్నమాంబ చేతిలో పెట్టారు. "ఇలాంటి కిరీటాన్ని మీరు కూడా బాబాకు చేయించాలి.." అని చెప్పారు. ఈ ఊహించని మాటలకు ఆశ్చర్యపోయిన రత్నమాంబ పక్కనే ఉన్న రామకృష్ణను.. "అంత ఖరీదైన కిరీటాన్ని మనం చేయించగలమా.." అన్నట్టుగా చూసింది. ఆమె భావాన్ని అర్థం చేసుకున్న రామకృష్ణ.. అంతా బాగా జరిగితే.. చేయిద్దాం అని భరోసా ఇచ్చాడు. ఈ ఘటన జరిగిన రెండు నెలలకు అంటే.. 1992 నవంబర్​లో రత్నమాంబ కన్నుమూశారు.

భార్యవియోగంతో బాధతో కుంగిపోకుండా పిల్లలకు మంచి చదువులు అందించి.. అందరికీ పెళ్లిళ్లు చేశారు. పిల్లలంతా అమెరికాలో స్థిరపడటంతో.. రామకృష్ణ మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. వయసుపైబడటంతో.. ఒంటరిగా ఉన్న తండ్రిని పిల్లలు అమెరికాకు తీసుకెళ్లారు. కానీ.. భార్య అడిగిన కోరిక తనను ఊరికే కూర్చోనివ్వలేదు. అమెరికాలో కూడా రామకృష్ణ ఊరికే కాలక్షేపం చేయకుండా.. పలు వైద్యశాలల్లో ప్రొఫెసర్​గానూ.. డీన్​గానూ.. పనిచేశారు. వచ్చిన డబ్బును జాగ్రత్తగా పోగు చేసుకున్నారు. ముప్పై ఏళ్లుగా భార్య అడిగిన కోరికను నెరవేర్చేందుకు తన పరిధిలో నిరంతరం శ్రమించారు. చివరికి.. అనుకున్నంత డబ్బు పోగయ్యాక ఇండియాకు వచ్చి... హైదరాబాద్​లో బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. తన భార్య అడిగిన కోరిక మేరకు పిల్లలతో సహా షిరిడీ వచ్చి.. బంగారు కిరీటాన్ని బాబాకు సమర్పించారు.

బాబా ఆదేశించాడు కాబట్టే...

"ఈరోజు బాబాకు బంగారు కిరీటం చేయించానంటే.. దాంట్లో నా కృషి ఏమీ లేదు. అంతా సాయి కృపే. ఆ రోజు నా భర్యను పూజారి కోరినప్పుడు.. బాబానే మమ్మల్ని ఆదేశించినట్టనిపించింది. అందుకే.. ఇన్ని రోజులు కష్టపడి బాబాకు కిరీటం చేయించాం. హైదరాబాద్​ గాంధీలో సర్జన్​గా చేశాను. విరమణ అనంతరం.. పలు కాలేజీల్లో ప్రొఫెసర్​గా, డీన్​గా చేశాను. అమెరికాకు వెళ్లాక కూడా పలు కాలేజీల్లో బోధిస్తున్నాను. ఇప్పటికీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో డీన్​గా పనిచేస్తున్నాను. 88 ఏళ్ల వయసులో నా భార్య కోరిక తీర్చడం చాలా సంతోషంగా ఉంది. నేను ఆమె కోరికను నెరవేర్చాను. బాబా కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నా." -డాక్టర్​ రామకృష్ణ, బంగారు కిరీటం దాత

"ఈరోజు మాకు మర్చిపోలేని రోజు. మా అమ్మ అడిగిన కోరికను నాన్న ఈరోజు నెరవేర్చటం మాకెంతో ఆనందంగా ఉంది. నాన్న ఎంతో కష్టపడి మాకు సపోర్ట్​ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. ఇదంతా బాబా దయవల్లే. అందరి పట్ల బాబా దయ ఉండాలని మా కుటుంబం తరఫున కోరుకుంటున్నాం."- శుభశ్రీ, రామకృష్ణ కుమార్తె

ఇవీ చూడండి:

Last Updated : Jul 22, 2022, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details