తెలంగాణ

telangana

ETV Bharat / city

నగరంలో స్తంభించిన జనజీవనం.. శివారు మున్సిపాలిటీల్లో అధ్వానం - భాగ్యనగర శివారు మున్సిపాలిటీల్లో పరిస్థితి అధ్వానం

నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ప్రత్యేకించి భాగ్యనగరంలో రోడ్లు జలమయమయ్యాయి. జీహెచ్‌ఎంసీ చుట్టు పక్కల శివార్లు, పురపాలక సంఘాల్లోని పలు కాలనీలు తడిసిముద్దయ్యాయి. నాలాలు, డ్రైనేజీ కాలువలు పొంగి ప్రవహిస్తుండటం వల్ల ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలకు నిద్రాహారాలు కూడా ఉండటం లేదు.

humn life cycle struck with rains in hyderabad and  bad cituation in outcut municipalities
నగరంలో స్తంభించిన జనజీవనం.. శివారు మున్సిపాలిటీల్లో అధ్వానం

By

Published : Aug 18, 2020, 12:17 PM IST

Updated : Aug 18, 2020, 12:52 PM IST

నగరంలో స్తంభించిన జనజీవనం.. శివారు మున్సిపాలిటీల్లో అధ్వానం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలకు పల్లెలు, పట్టణాలు, నగరాలు తడిసిముద్దయ్యాయి. భద్రాచలం వద్ద పావన పవిత్ర గోదావరి నది మూడో ప్రమాదకర హెచ్చరిక కొనసాగుతుండగా... ఇతర నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్‌, భద్రాచలం లాంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమై... జనజీవనం స్తంభించిపోయింది.

రాజధాని హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల ప్రభావంతో రహదారులన్నీ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అసలే కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు... ఈ వర్షాలతో మరింత భయకంపితులవుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో కాలనీల్లో వరద పోటెత్తుతోంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరి... పాములు, కప్పలతో సహజీవనం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

శివారు ప్రాంతాల దుస్థితి

నగర శివారు ప్రాంతాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో... తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా కాలనీల్లో ఎన్నో కుటుంబాలు ఆర్థిక స్థోమత బట్టి కొత్తగా నిర్మించుకున్న ఆధునిక భవనాలు, సాధారణ ఇళ్లు, రేకుల ఇళ్లు వంటివి ఉంటున్నాయి. పలు పురపాలక సంఘాల్లో అధిక శాతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలనీలు కనిపిస్తున్నాయి.

ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ కాలువలు, నాలాలు, డ్రైనేజీలు కాలనీలను కుమ్మేస్తున్నాయి. ప్రత్యేకించి పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘంలో పరిస్థితి దారుణంగా ఉంది. వనస్థలిపురం ఎగువ నుంచి వస్తున్న మూసీ, డ్రైనేజీ ప్రవాహంతో హయత్‌నగర్‌, కుంట్లూరు-నాగోల్‌, ఘట్‌కేసర్‌, యాదాద్రి భువనగిరి రహదారి దెబ్బతిని వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మూసీ పొంగి రోడ్లపైకి, ఇళ్లల్లోకి నీరొస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.

కొత్త ఇళ్లలోకి వరదొచ్చింది

గతంలో రూ.16 కోట్లతో వ్యయంతో వనస్థలిపురం నుంచి కుంట్లూరు వైపు 3 కిలోమీటర్లు డ్రైనేజీ పైపులైన్ భూదాన్‌నగర్‌ వరకు వేసి వదిలేశారు. ఆ తర్వాత మిగతా అసంపూర్తి పనులు పూర్తికాలేదు. ఇందుకోసం ప్రభుత్వం మరో రూ.14 కోట్లు మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియలో జాప్యం వల్ల పనులు ప్రారంభం కాలేదు. ఫలితంగా వరుస వర్షాలతో జయప్రకాష్‌ కాలనీలో పలు ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. కాలనీ ఆవిర్భావం తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి.

బోనాలకు దూరం...

శ్రావణ మాసంలో చివరి ఆదివారం ఘనంగా జరుపుకోవాల్సిన బోనాల పండుగకు ప్రజలు దూరంగా ఉండాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని ఇళ్ళల్లో గ్యాస్‌ లేక కట్టెల పొయ్యిపై వంట కూడా చేసుకోలేని పరిస్థితి. పురపాలక శాఖ జోక్యం చేసుకుని పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘంలో మూసీ, డ్రైనేజీ కాలువలు మెరుగుపరచాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Last Updated : Aug 18, 2020, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details