తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఈసారి భారీగా దిగుబడులు... కొనుగోళ్లు ఎలా? - తెలంగాణలో పంట సాగు

ఖరీఫ్‌ సీజన్‌ ముగిసింది.. వానలు దండిగా పడడం వల్ల పంటలూ భారీగా సాగయ్యాయి.. రికార్డు స్థాయిలో దిగుబడులు రానున్నాయి. పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ప్రకృతి సంబంధమైన సవాళ్లు ఎన్నింటినో ఎదుర్కొని పంట పండించాడు రైతు. వాటన్నింటినీ మద్దతు ధరలకు కొనడమనేది ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న సవాలు.

huge yields in telangana hwere farmers afraid about purchases
రాష్ట్రంలో ఈసారి భారీగా దిగుబడులు... కొనుగోళ్లు ఎలా?

By

Published : Sep 30, 2020, 6:46 AM IST

పంట కొనుగోళ్లకు కొత్త మార్కెటింగ్‌ ఈ గురువారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్లో విశేషమేమిటంటే.. పంటల దిగుబడులు రికార్డు స్థాయిలో పెరగడం ఒకటైతే.. కొత్త మద్దతు ధరలు మరొకటి. ఇంకో విశేషం కొత్త వ్యవసాయ చట్టాల నేపథ్యంలో వస్తున్న తొలి సీజన్‌ కావడం. ఇటీవల మూడు వ్యవసాయ బిల్లులను కేంద్రం పట్టుబట్టి పార్లమెంటులో ఆమోదింపజేసిన విషయం తెలిసిందే. ఈనెల 28 నుంచి అవి అమల్లోకి వచ్చాయి. పంటల కొనుగోళ్లకు వ్యవసాయ మార్కెట్లతో సంబంధం లేదని, ఎవరైనా.. ఎక్కడైనా స్వేచ్ఛగా రైతుల నుంచి కొనవచ్చన్నది ఈ చట్టాల సారాంశం. వీటి వల్ల బడుగు రైతు నష్టపోతాడని.. వ్యాపారులది ఇష్టారాజ్యమవుతుందనేది ప్రతిపక్షాల వాదన. కొత్త చట్టాలు అక్కరకొస్తాయో.. రైతును దిక్కులేనివాణ్ని చేస్తాయో చూడాలి! ఈ కొత్త చట్టాలను అమలు చేస్తుందో లేదో తెలంగాణ ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని మార్కెటింగ్‌ సంచాలకుల కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త పంటల కొనుగోళ్లు ఎలా జరగబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

రాష్ట్రంలో ఖరీఫ్​ పంటల సాగు తీరు

మద్దతు ధరలు దక్కేనా?

ఈ ఏడాదికి కేంద్రం 24 రకాల పంటలకు కొత్త మద్దతు ధరలను ప్రకటించింది. అవి రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. దేశం మొత్తం మీద ఆహార ధాన్యాల దిగుబడి 14.45 కోట్ల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. వాటిని మద్దతు ధరలకు కొనడం ప్రభుత్వాలకు పెద్దసవాలుగా మారనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో ఈ సీజన్‌లో సాగుచేసిన పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు 13.77 లక్షల టన్నులను మద్దతు ధరలకు కొనాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఆదేశించింది. ఈ కోటాలో పెసర, సోయాచిక్కుడు కొనుగోళ్లు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయశాఖను కోరింది.

దేశవ్యాప్తంగా రికార్డు స్థాయి దిగుబడులు..

  • ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వర్షాలు బాగా పడుతున్నందున గతేడాది ఖరీఫ్‌తో పోలిస్తే సాగు విస్తీర్ణం అదనంగా అర కోటి హెక్టార్ల మేర పెరిగింది. గతేడాది (2019) వానాకాలంలో 10.66 కోట్ల హెక్టార్లలో పంటలు వేయగా ఈ సీజన్‌లో 11.16 కోట్ల హెక్టార్లు సాగయింది.
  • దేశం మొత్తంమీద సాగయిన పత్తిపంటలో 46 శాతం తెలంగాణలోనే ఉంది. అన్ని రాష్ట్రాల్లో పత్తి సాగు విస్తీర్ణం పెరిగినందున దిగుబడులు అధికంగా వస్తాయని, ధరలపైనా ప్రభావం ఉంటుందని వ్యాపారవర్గాల అంచనా.
  • దేశవ్యాప్తంగా వరి సాగు 55 లక్షల ఎకరాలు అదనంగా పెరిగింది. ఈ సీజన్లో 10.23 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని కేంద్రం అంచనా.
    దేశంలో ఖరీఫ్​ పంటల సాగు తీరు

రాష్ట్రంలోనూ రికార్డు

  • తెలంగాణలో ఈ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో 1.34 కోట్ల ఎకరాలకు చేరిందని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి చెప్పారు. దిగుబడులు అదేస్థాయిలో వస్తాయని అంచనా వేస్తున్నట్లుచెప్పారు.
  • రాష్ట్రంలో పత్తి, వరి, కంది పంటలే 92.11 శాతం సాగయ్యాయి.
  • పత్తి సగటున ఎకరానికి 8 క్వింటాళ్ల చొప్పున వచ్చినా మొత్తం 4.80 కోట్ల క్వింటాళ్లకు పైగా మార్కెట్లకు వస్తుందని అంచనా.
  • వీటిన్నింటినీ మద్దతు ధరకు కొనడం పెద్ద సవాలేని మార్కెటింగ్‌శాఖ భావిస్తోంది.
  • వరి ఎకరానికి 2 టన్నుల చొప్పున లెక్కించినా కోటీ 5 లక్షల టన్నుల ధాన్యం రావచ్చని భావిస్తున్నారు. సుమారు 75 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.
  • కంది తప్పనిసరిగా మద్దతు ధరకు కొంటామని ప్రభుత్వం సీజన్‌కు ముందే ప్రకటించింది. ఇప్పుడు కేంద్రం కూడా 13.77 లక్షల టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు అనుమతించగా మార్కెటింగ్‌ శాఖ ఊపిరిపీల్చుకుంది.

వ్యాపారులు కొంటారా.. లేదా?

కొత్త చట్టాలతో వ్యవసాయ మార్కెట్ల ఉనికి ప్రశ్నార్థకమైంది. పంటలు కొనే వ్యాపారులు మార్కెట్లకు రానక్కరలేదని, మార్కెట్‌ రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని కొత్త చట్టాలు చెబుతున్నారు. వ్యాపారులు మార్కెట్లకు రాకపోతే అక్కడికి పంటలు తీసుకెళ్లాలా వద్దా అనే సందేహం రైతుల్లో ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ స్పష్టత ఇవ్వలేదు. దీనివల్ల మార్కెటింగ్‌ శాఖ అధికారులను అడిగితే ప్రభుత్వానికి వివరణ కోసం లేఖ రాశామని, సమాధానం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. పత్తి పంటను ‘భారత పత్తి సంస్థ’ (సీసీఐ), వరి ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ, కందులు, సోయా, పెసర వంటి పప్పుధాన్యాలను కేంద్రం మద్దతు ధరకు కొంటాయని వారు వివరించారు. మిగతా పంటలను వ్యాపారులు స్వేచ్ఛగా కొనుక్కునే అవకాశముంది. కానీ వారు మద్దతు ధర ఇస్తారా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ బిల్లులను సీఎం కేసీఆర్‌ వ్యతిరేకించినందున కొత్త చట్టాల అమలుపై ప్రభుత్వం ఏం చేస్తుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

ఇదీ చదవండిః'ఆ రసాయనం వాడితే పంటలను తగలబెట్టక్కర్లేదు'

ABOUT THE AUTHOR

...view details