Grand Nursery Mela:హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పిపుల్స్ ప్లాజాలో అసోసియేషన్ ఆఫ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ సంస్థ ఆధ్వర్యంలో గ్రాండ్ నర్సరీ మేళాను నిర్వహించారు. ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనన నేటితో ముగియనుంది. ఇందులో దేశం నలుమూలల నుంచి ప్రముఖ విత్తన, నర్సరీ, సేంద్రీయ ఉత్పత్తుల, వ్యవసాయ పనిముట్లు, టెర్రసె గార్డెనింగ్ సంస్థలు తరలి వచ్చి తమ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బంగా, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి పలు విత్తన, నర్సరీ, టెర్రస్ గార్డెనింగ్, ఇతర సంస్థలు 150 వరకు స్టాళ్లు కొలువు తీరాయి.
ఈ మేళాలో నాణ్యమైన దేశవాళీ, సంకర జాతి విత్తనాలే కాకుండా నగర సేద్యం సంబంధించి అందమైన పూలు, కూరగాయల మొక్కలు, నారు, అలంకరణ మొక్కలు, కుండీలు, పిచికారీ యంత్రాలు, పనిముట్లు, సామగ్రి, సేంద్రీయ ఉత్పత్తులు, మార్కెటింగ్ వ్యూహాలు ప్రదర్శించారు. దేశంలో కీలక ఉద్యాన రంగంలో విప్లవాత్మకమైన కొత్త పోకడలు దృష్ట్యా ఈ సారి ఆధునిక విజ్ఞానం, యంత్రాలు, వర్టికల్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్, లాండ్ స్కేప్, హైడ్రోపొనిక్స్ తదితర సాంకేతిక పరిజ్ఞానాలు ప్రత్యేకతలు అని తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్స్ సంస్థ అధ్యక్షుడు ఖలీద్ అహ్మద్ తెలిపారు.