Grand Nursery Mela: హైదరాబాద్‌లో 11వ గ్రాండ్ నర్సరీ మేళా ఉత్సాహంగా సాగుతోంది.పీవీ నరసింహారావు మార్గ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణలో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వరకు సాగనున్న మెగా గ్రాండ్ నర్సీరీ మేళాకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరైన మిద్దెతోటల నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రోత్సాహకాలను మిద్దె సాగుదారులకు తెలియజేశారు. జంట నగరాల్లో 25 వేల మంది ఇంటి పంటలు సాగు చేస్తున్న దృష్ట్యా... రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 20 లక్షల పైగా చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని లోక వెంకటరామిరెడ్డి తెలిపారు.
పలువురు ఔత్సాహికులు ఖాళీ జాగాలు, డాబాలు, బాల్కనీల్లో సహజ సేంద్రీయ విధానం కింద కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటున్నారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్, గార్డెన్ గ్రూపు ఫ్రెండ్స్ పేరిట వాట్సప్ గ్రూపులు సృష్టించి మిద్దెతోటల మహిళలను ఓ వేదికపై తీసుకొచ్చేందుకు అర్కార శ్రీనివాసరావు, తోట ఎలిబెత్ లాంటి ప్రకృతి ప్రేమికులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి నెలా రెండు సార్లు ఏదో ఒకచోట ప్రత్యేకంగా సమావేశమై నిపుణుల సూచనలతో సాగు చేస్తున్నారు.