తెలంగాణ

telangana

ETV Bharat / city

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యం - cybe her program

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళా భద్రతా విభాగాన్ని సైతం ఏర్పాటు చేసింది. సైబర్ వేధింపులకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో.. మహిళా భద్రతా విభాగం అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గృహహింస ఎదుర్కొనే ప్రవాస భారతీయ మహిళలకు సైతం అధికారులు అండగా నిలుస్తున్నారు.

'cybe her' awareness program
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యం

By

Published : Oct 11, 2020, 6:02 AM IST

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం విశేష ప్రాధాన్యం

గృహహింస, సైబర్ వేధింపులు, పోకిరీల వికృత చేష్టలతో.. మహిళలు, చిన్నారులు దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే కుటుంబ పరువుపోతుందని భయపడి వెనకడుగు వేస్తున్నారు. ఎవరిని, ఎక్కడ సంప్రదించాలో తెలియక మరికొంతమంది బాధితులు మిన్నకుండిపోతున్నారు. అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మహిళా భద్రతా విభాగం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే షీటీంల ద్వారా యువతులు, మహిళలకు భరోసా కల్పిస్తున్న పోలీసులు.. ఇతర అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వల్ల చాలామంది యువతులు, మహిళలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉద్యోగాలు సైతం ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. విద్యార్థులూ ఆన్‌లైన్ ద్వారానే పాఠాలు వింటున్నారు. దీంతో తెలియకుండానే కొందరు సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు.

సైబ్​ హర్​కు విశేష స్పందన..

సైబర్ వేధింపులకు గురికాకుండా యువతులు, మహిళలు, విద్యార్థినిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నారు. "సైబ్‌ హర్" పేరిట నెల రోజులకు పైగా నిర్వహించిన ఆన్‌లైన్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.

ఏడాది కాలంలో 119 ఫిర్యాదులు..

ప్రవాస భారతీయ మహిళలకు సంబంధించిన కేసులను సైతం మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సులువుగా పరిష్కరిస్తున్నారు. విదేశాల్లో ఉండే రాష్ట్ర మహిళలకు సంబంధించిన వరకట్నం, గృహహింస వేధింపుల కేసులపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరిస్తున్నారు. ఏడాది కాలంలో 119 ఫిర్యాదులు రాగా వాటిలో 76 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి అభియోగపత్రాలు దాఖలు చేశారు. మరో 43 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఏడుగురి పాస్‌పోర్టులు సైతం రద్దు చేశారు. బాధితులు ఏ దేశాల్లో ఉంటున్నారో.. ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో పాటు అక్కడ ఉండే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని మహిళా భద్రతా విభాగం ముందుకు వెళ్తోంది.

మహిళలతో మర్యాదపూర్వకంగా మెలిగేలా ..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా పోలీస్‌స్టేషన్ల సీఐ, ఎస్​ఐ, షీటీంలకు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయడంతో పాటు... ఫిర్యాదు చేయడానికి వచ్చే మహిళలతో మర్యాదపూర్వకంగా మెలిగేలా తర్ఫీదు ఇస్తున్నారు.

ఇవీ చూడండి:ఈటీవీ భారత్​ ప్రత్యేకం.. ఏపీ ఎంసెట్ ర్యాంకర్ల మనోగతం

ABOUT THE AUTHOR

...view details