tdp mahanadu: తెలుగుదేశం రెండు రోజుల పండుగ మహానాడు ఘనంగా విజయవంతమయింది. మహానాడు రెండో రోజున ఎన్టీఆర్ జయంతి సందర్భంగా.. నిర్వహించిన మహాసభకు అశేష జనవాహిని పోటెత్తింది. ప్రయాణాలకు బస్సులు, వాహనాలు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించినా మండే ఎండలు పిండేస్తున్నా.. వడగాలులు భయపెడుతున్నా.. ఇవేవీ తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులను అడ్డుకోలేకపోయాయి. లారీలు, ట్రక్కులు, ట్రాక్టర్లు, కార్లు ఇలా ఏ వాహనం కుదిరితే అందులో సొంత ఖర్చులు పెట్టుకుని స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఎటు చూసినా.. లారీలు, ట్రక్కులు, ట్రాక్టర్ల నిండా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులే దర్శనమిచ్చారు.
లారీలు, ట్రాక్టర్లలో: దాదాపు 10-15 ఏళ్ల తర్వాత జనం మళ్లీ లారీలు, ట్రాక్టర్లలో తరలిరావడం మహానాడు సందర్భంగా కనిపించింది. ద్విచక్రవాహనాలైతే అసాధారణ సంఖ్యలో వచ్చాయి. మహాసభ సాయంత్రం 4 గంటలకు మొదలవుతుందని తెలిసినా ఉదయం 7 గంటల నుంచే సభా ప్రాంగణానికి భారీ సంఖ్యలో జనం పోటెత్తారు. ఉదయం 7 గంటలకే 20 వేల మందికి పైగా రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అందరూ మధ్యాహ్నం తర్వాత వస్తారన్న ఉద్దేశంతో అప్పటికి సిద్ధమయ్యేలా భోజన ఏర్పాట్లు చేసుకుంటున్న పార్టీ నాయకులు ఉదయం నుంచే జనం స్పందన చూసి అప్పటికప్పుడే అప్రమత్తమయ్యారు. ఉదయం 11 గంటల సమయానికే సుమారు 60 వేల మంది సభా ప్రాంగణానికి చేరుకోగా మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంది.
ఎండను సైతం లెక్క చేయకుండా: శుక్రవారం మహానాడు తొలి రోజు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినవారిలో చాలా మంది బహిరంగసభలోనూ పాల్గొనే వెళ్లాలన్న పట్టుదలతో ఉండిపోయారు. సభలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాలకు చెందినవారు శుక్రవారం రాత్రికే ఒంగోలు చేరుకున్నారు. కొందరు శనివారం ఉదయం నుంచి బయల్దేరి వెళ్లారు. ఎండకు ఎండుతూనే జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. చిన్నాపెద్దా, మహిళలు, వృద్ధులూ అనే తేడా లేకుండా అన్ని వర్గాలవారూ.. రెట్టించిన ఉత్సాహంతో కదలివచ్చారు. ట్రాఫిక్ నియంత్రించేవారు లేక... కొన్ని చోట్ల అవరోధాలు ఏర్పడగా కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిచిపోయాయి. చాలా మంది సభా ప్రాంగణానికి సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపేసి.. నడిచివచ్చారు. కొందరైతే 10 కిలోమీటర్ల దూరం నడిచి సభకు హాజరయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమయ్యేసరికి.. ఆ ప్రాంగణమంతా లక్షల మందితో నిండిపోయింది. కనుచూపు మేర ఇసుక వేసినా రాలనంత జనం కనిపించారు.
ఇదే తొలిసారి: రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత ఇంత భారీ స్థాయిలో ఒక రాజకీయ పార్టీ సభ జరగడం ప్రతిపక్షంలో ఉన్న ఒక పార్టీ ఇచ్చిన పిలుపుతో లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలిరావడం ఇదే తొలిసారి. తెలుగుదేశం చరిత్రలో ఎన్నో మహానాడులు, భారీ సభలు జరిగినా... అనేక నిర్బంధాలు, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా జనం ఓ ప్రవాహంలా తరలిరావడంతో ఈ సభ ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్ధమేననే సంకేతాన్ని తెలుగుదేశం ఇచ్చింది. యువత చంద్రబాబుకు బాగా కనెక్ట్ అయ్యారని మహానాడు వేదికగా తెలుగుదేశం స్పష్టచేసింది. మహానాడు వేదికలో చంద్రబాబు ప్రసంగిస్తుంటే యువత ఈలలు, కేరింతలు, కేకలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల కల్పన లేకపోవడం వంటి విషయాల్ని యువత జీర్ణించుకోలేక పోతున్నారనే విషయం మహానాడులో స్పష్టంగా కనిపించిందని నాయకులు ఉద్ఘాటించారు. ప్రభుత్వ వేధింపులకు గురవుతున్న వర్గంలో యువత కూడా ఉండటం ఇందుకు కారణమని చెప్పారు. ఈ సారి మహానాడులో చాలా మంది సీనియర్లు ప్రసంగాలకు దూరంగా ఉన్నారు. సీనియర్ నేత పయ్యావుల కేశవ్.. సభ నిర్వహించగా.... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు.. అయ్యన్నపాత్రుడు, జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్లు కొందరే ప్రసంగించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన మాట్లాడుతున్నపుడు.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.
మార్మోగిన సభా ప్రాంగణం: సాధారణంగా రాజకీయ పార్టీల సభలంటే పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడం, నాయకుల ప్రసంగాలు మొదలవగానే వారు తిరుగుముఖం పట్టడం వంటి దృశ్యాలు కనిపిస్తాయి. మహానాడు సభలో ఇందుకు విరుద్ధమైన దృశ్యాలు దర్శనమిచ్చాయి. పార్టీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులు ముఖ్యంగా యువత ఉత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. బారికేడ్లు తోసుకుంటూ మరీ సభలోకి దూసుకొచ్చారు. చంద్రబాబు, బాలకృష్ణ వేదికపైకి వచ్చినప్పుడు.. సుమారు 15 నిమిషాల పాటు సమావేశ ప్రాంగణం హోరెత్తింది. ఈలలు, కేకలు, నినాదాలతో మార్మోగింది. చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు.. యువత.. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు సహా ముఖ్య నాయకుల ప్రసంగాల్లో.. ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైనా ఘాటు విమర్శలు చేసినప్పుడు కార్యకర్తలు, ప్రజలు.. పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు సభ ముగిసేంత వరకూ... ప్రాంగణంలో జనం అంతే ఉత్సాహంతో ఉన్నారు. సభ ముగిశాకే తిరుగుముఖం పట్టారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో అత్యధికం... ములుగులో అత్యల్పం...
ఆ గ్రామంలో ఇప్పటికీ అంధ విశ్వాసాలు.. బాలింతలకు నో ఎంట్రీ