రాష్ట్ర రాజధానిలో ఉరుములు, మెరుపులతో వరుణుడు విరుచుకుపడ్డాడు. శుక్రవారం సాయంత్రం ఐదున్నరకు మొదలైన వాన.. రాత్రి 8 గంటల వరకూ కుండపోతగా కురిసింది. రికార్డుస్థాయిలో 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటి వానకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పలుకాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉస్మాన్ గంజ్, లంగర్ హౌజ్, టోలిచౌకి, డబీర్‌పురా, సికింద్రాబాద్ ప్రాంతంలోని పలుకాలనీల్లోకి నీరు చేరింది. మెహిదీపట్నం భోజగుట్ట పునరావాస కేంద్రంలో ఓ గుడిసె కూలిపోయింది. అంబర్‌పేట్ గోల్నాకలో ఓ గోడ కూలిన ఘటనలో కూరగాయల బండి, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి. ఖైరతాబాద్ పీజేఆర్ నగర్‌లో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. టోలిచౌకి-గచ్చిబౌలి ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నిలిచిన నీటిలో ఓ వ్యక్తి ఈత కొడుతూ ముందుకెళ్లాడు. జలమయమైన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీతో పాటు విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి సహయక చర్యలు చేపట్టారు.
రోడ్లపై పడిగాపులు
నగరంలో వరదనీరు రోడ్లపైకి చేరి కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. రాజ్‌భవన్ ప్రాంతం చెరువును తలపించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఇతర ప్రాంతాల్లో రోడ్డుపై నడుముల్లోతు నీరు చేరగా.. ట్రాఫిక్ స్తంభించింది. పంజాగుట్ట, అమీర్‌పేట ప్రాంతాల్లో అంబులెన్స్‌లు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకున్నాయి. కోఠి నుంచి మలక్‌పేట్ వరకూ ట్రాఫిక్ స్తంభించగా వాహనదారులుల వర్షంలోనే గంటల పాటు రోడ్లపై పడిగాపులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి.
ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై పరిస్థితిని సీపీ అంజనీ కుమార్ పరిశీలించారు. నగరశివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో కుండపోత వర్షం పడగా.. విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా నీరు చేరింది. దీంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి.. జిల్లాల నుంచి వచ్చిన బస్సులకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం 7 గంటలకు ఇంటికి చేరాల్సిన వారు అర్ధరాత్రి వరకు రోడ్లపైనే వేచిచూశారు. రాత్రి వరకూ మెట్రోరైల్ అందుబాటులో లేనందున ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు.