తెలంగాణ

telangana

ETV Bharat / city

మెరుగవుతున్న మెట్రోయానం.. పెరుగుతున్న ప్రయాణికుల శాతం

దసరా పండుగ సెలవుల తర్వాత మెట్రోలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మెట్రోరైలు ఛార్జీల్లో రాయితీలిస్తూ అక్టోబరు 17న ప్రవేశపెట్టిన సువర్ణ ఆఫర్‌తో 30 శాతం ప్రయాణికులు పెరిగారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పనిదినాల్లో సగటున రోజు 1.30 లక్షల ప్రయాణికుల ట్రిప్పులు నమోదవుతున్నాయని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు.

Hyderabad metro Train
మెరుగవుతున్న మెట్రోయానం

By

Published : Nov 1, 2020, 7:41 AM IST

మెట్రో సువర్ణ ఆఫర్‌లో భాగంగా నవంబరు ఒకటి నుంచి స్మార్ట్‌కార్డుపై గరిష్ఠంగా 50 శాతం క్యాష్‌బ్యాక్‌, ఉచితంగా అదనపు ట్రిప్పులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు.

మెట్రో స్మార్ట్‌కార్డులను స్టేషన్లు, ఆన్‌లైన్‌, యాప్‌లో ఎక్కడ రీఛార్జ్‌ చేసుకున్నా గరిష్ఠంగా 50 శాతం సొమ్ము అదనంగా కార్డులో జమవుతుంది. 90 రోజుల్లోపల ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు రూ.1500 రీఛార్జ్‌ చేసుకుంటే రూ.600 అదనంగా జమవుతుంది. ఎప్పటిలాగే స్మార్ట్‌కార్డు ప్రయాణంపై 10 శాతం తగ్గింపు ఉంటుంది. క్యాష్‌బ్యాక్‌ కోసం రూ.400 కనీసం రీఛార్జ్‌ చేసుకోవాలి. దీనికి వంద అదనంగా జమవుతుంది. గరిష్ఠంగా రూ.2000 వరకు రీఛార్జ్‌ చేసుకోవచ్ఛు.

మెట్రో సువర్ణ ట్రిప్‌ ఆఫర్‌లో అదనంగా ఉచిత ట్రిప్పులు ఇస్తున్నారు. స్మార్ట్‌కార్డుపై ఇప్పటికే ఈ పథకం అందుబాటులో ఉండగా తాజాగా యాప్‌లోనూ తీసుకొచ్చారు. 14 ట్రిప్పుల టికెట్‌ తీసుకుంటే అదనంగా ఆరు ఉచితంగా ఇస్తారు. 20 ట్రిప్పులకు అదనంగా 10 ట్రిప్పులు ఉచితం. 40 ట్రిప్పులు కొంటే అదనంగా 20 ట్రిప్పులు ఉచితం. ట్రిప్పుల ఆధారంగా నెల నుంచి రెండునెలల వ్యవధిలో ఉపయోగించుకోవాలి.

నాగోల్‌ మెట్రో స్టేషన్‌కు ఐజీబీసీ అవార్డు

నాగోల్‌ మెట్రోరైలు స్టేషన్‌కు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ)- 2020 అవార్డు వరించింది. పర్యావరణహిత ప్రాంగణం పనితీరు సవాల్‌లో మెరుగ్గా నిలిచి అవార్డు గెల్చుకుంది. పొదుపుగా, సమర్థంగా విద్యుత్తు, నీటి వినియోగం, పచ్చదనం నిర్వహణలో రెండేళ్ల పనితీరును పరిశీలించి అవార్డుకు ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 91 ప్రాజెక్టులు విభిన్న విభాగాల కింద పోటీపడితే.. 20 ప్రాజెక్టులు అవార్డులకు ఎంపికయ్యాయి. నాగోల్‌ స్టేషన్‌.. మెట్రో రవాణా భవనాల విభాగంలో ఎంపికైంది.

స్టేషన్లలో విద్యుత్తు వినియోగం ఎక్కువ అవసరం లేకుండా సహజ కాంతి వచ్చేలా తగిన ఏర్పాట్లు చేశామని ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. స్టేషన్‌ పైకప్పుపైన సౌర విద్యుత్తు పలకలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వాననీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, మూత్రశాలల్లో తక్కువ నీరు వినియోగం, పచ్చదనం పెంపు చర్యలతో స్టేషన్లను జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details