ప్రతి తల్లి తన పిల్లాడిని చిన్ని కృష్ణుడుగానే భావిస్తుంది, చిట్టి తల్లిని రాధగానో, గోపిగానో ముద్దుగా చూసుకుంటుంది. కృష్ణాష్టమి రోజున తమ పిల్లలకు ప్రత్యేక అలంకరణ చేసి మురిసిపోవడం నేటిది కాదు ఏనాటి నుంచో వస్తున్న సంప్రదాయమే. ఇప్పుడు పాఠశాలల్లో చిన్నారులకు సంప్రదాయ పండుగలను పరిచయం చేసే ఉద్దేశంతో అన్ని పర్వదినాలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కోసం గోపిక, కృష్ణుల వేషధారణకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఎక్కడ చూసినా... ఆయా వస్త్రాలే దర్శనమిస్తున్నాయి. ధర కాస్త ఎక్కువున్నా పర్వాలేదని... పిల్లల ముద్దే ముఖ్యమంటున్నారు తల్లిదండ్రులు.
గోకులాష్టమి ప్రత్యేక డిజైన్లు
గోకులాష్టమి పురస్కరించుకుని నగరంలోని కోటీ, సుల్తాన్ బజార్, బేగం బజార్, దిల్సుఖ్నగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లోని మార్కెట్లలో గోపిక వస్త్రధారణకు కావాల్సిన ముత్యాల గొలుసులు, దుపట్టాలు, లంగా జాకెట్ల సెట్లు, వెన్న ముంతలు వివిధ ఆకృతులు, సరికొత్త డిజైన్లతో దర్శనమిస్తున్నాయి. ఇక కన్నయ్య కోసం ప్రత్యేకంగా వేణువులు, ముత్యాల హారాలు, నెమలి పింఛాలు, కిరీటాలు, పట్టు పంచెలు అందుబాటులోకి తీసుకువచ్చారు అమ్మకం దారులు.