రాష్ట్ర రాజధాని వాసులు చవితి పండగకు సిద్ధమవుతున్నారు. కరోనా వైరస్ దృష్ట్యా ఈసారి గణేశుడి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. చాలామంది మట్టి విగ్రహాల వైపే దృష్టి సారిస్తున్నారు. ఒక అడుగు నుంచి మూడు, నాలుగు అడుగులున్న విగ్రహాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కనిష్టంగా రూ.30 నుంచి గరిష్ఠంగా రూ.15 వందల వరకు మట్టి విగ్రహాల ధరలు పలుకుతున్నాయి. రంగుల విగ్రహాలు అమ్మే కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఇళ్లల్లో పెట్టి పూజ చేసుకునే వాళ్లతోపాటు.. అసోసియేషన్లు, కాలనీ సంఘాలు, యువజన సంఘాల వాళ్లు.. మట్టి విగ్రహాలు పెట్టేందుకే మొగ్గుచూపుతున్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద సందడి..
వైరస్ వల్ల ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక తయారీదారులు కొద్ది మొత్తంలోనే మట్టి విగ్రహాలు తయారు చేశారు. జనం ఒక్కసారిగా మట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపడంతో కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మోతీనగర్, ఫిల్మ్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం సహా అనేక ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద సందడి నెలకొంది. వివిధ రూపాల్లో తయారైన మట్టి గణపయ్యలను ఇష్టంగా తీసుకెళ్తూ కరోనా రక్కసి సమసి పోవాలని కోరుకుంటున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కూడా నగరంలో లక్షకుపైగా మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తోంది.