తెలంగాణ

telangana

ETV Bharat / city

కల్లోలం దాటి రోజులు గడిచినా... కన్నీరు ఆగటం లేదు

అకస్మాత్తుగా విజృంభించిన తుపాను.. అన్నదాతల శ్రమను బూడిదలో పోసిన పన్నీరులా మార్చింది. ఆ కల్లోలం దాటి రోజులు గడుస్తున్నా.. కర్షకుల కంట కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. ఎటూ చూసినా కాల్వలను తలపిస్తున్న పొలాలు వారి దైన్యాన్ని కళ్లకు కడుతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో నివర్‌ తుపాను ప్రభావిత రైతుల వెతలపై ప్రత్యేక కథనం.

కల్లోలం దాటి రోజులు గడిచినా... కన్నీరు ఆగటం లేదు
కల్లోలం దాటి రోజులు గడిచినా... కన్నీరు ఆగటం లేదు

By

Published : Dec 3, 2020, 6:54 PM IST

కల్లోలం దాటి రోజులు గడిచినా... కన్నీరు ఆగటం లేదు

నివర్‌ తుపాను సృష్టించిన కల్లోలం ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపింది. తుపాను ధాటికి చేతికొచ్చిన పంటంతా నీటిపాలైంది. పైరు నేలకొరిగింది. గార్గేయనదితో పాటు వాగుల ప్రవాహ ఉద్ధృతికి వ్యవసాయ బావులు, మోటార్లు, విద్యుత్‌ స్తంభాలు కొట్టుకుపోయాయి. తుపాను తెరిపి ఇచ్చి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చాలాచోట్ల పొలాలు నీటిలోనే దర్శనమిస్తున్నాయి. అప్పో సొప్పో చేసి పెట్టుబడులు పెట్టిన సన్న, చిన్నకారు రైతన్నలు గుండెలవిసేలా రోదిస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి.

రైతు ఆశలపై నీళ్లు...

చిత్తూరు జిల్లాలో రైతులు 40 వేల 555 ఎకరాల్లో వరి పంట వేయగా ఒక్క పుంగనూరు నియోజకవర్గంలోనే 6 వేల 868 ఎకరాల్లో సాగు చేశారు. మరో 14 వందల 47 ఎకరాల్లో చెరకు, మామిడి, టమాటా వంటి వాణిజ్య పంటలు వేశారు. ఫలితాలూ ఆశాజనకంగానే కనిపించాయి. రేపో, మాపో పంట చేతికందుతుందనే సమయానికి... వారి ఆశలకు తుపాను గండికొట్టింది.

త్వరగా పరిహారం...

నీట మునిగిన పంటను ఆరబెట్టుకునేందుకు కొందరు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియట్లేదంటూ కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే పంటనష్టం అంచనా వేసి వీలైనంత త్వరగా పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో మళ్లీ సాగు చేయడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి :'కేసీఆర్​ కంటే పువ్వాడ గొప్పవాడనే విషయం నాకు తెలియదు'

ABOUT THE AUTHOR

...view details