ఆంధ్రప్రదేశ్ విశాఖలోని హెచ్‌పీసీఎల్(HPCL) రిఫైనరీలో.. మే 25న జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణలో పలు లోపాలు వెలుగుచూశాయి. దీనిపై జిల్లా కలెక్టర్ నియమించిన ఉన్నతస్థాయి కమిటీ.. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక సమర్పించింది. వివిధ అంశాలలో గుర్తించిన లోపాలను నివేదికలో వివరించింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం నిర్ణీత కాలంలో జరగాల్సిన అగ్ని ప్రమాదాల నివారణ నిర్వహణ షెడ్యూల్ సరిగా అమలు కాలేదని గుర్తించింది.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆగస్టు 2020లో అల్ట్రాసోనిక్ పరీక్షను నిర్వహించలేదని.. కమిటీ తేల్చింది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించవలసిన అల్ట్రాసోనిక్ పరీక్షను చేయకపోవడం వల్ల.... అధిక ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోకార్బన్లను తరలించే పైపులైన్‌లు తుప్పు వల్ల కోతకు గురైన విషయాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని కమిటీ ఎత్తి చూపింది. పైపు లైన్లకు నిర్వహించవలసిన హైడ్రో టెస్ట్ ను సంస్థ గాలికొదిలేసిందని.. అది తీవ్రమైన తప్పుగా పరిగణించింది.