అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు తరలించే చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరుతూ... అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు వేసిన పిల్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి నుంచి సచివాలయాన్ని విశాఖకు తరలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేసింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఉన్నం మురళీధరరావు... కార్యనిర్వాహక రాజధానిని ఆకస్మాత్తుగా విశాఖకు తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మార్చి నెలలో నిర్వహించిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో మే నెలాఖరుకు రాజధానిని విశాఖకు తరలించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారని ప్రస్తావించారు. రాజధాని తరలింపుపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు శాసనవ్యవస్థ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై హైకోర్టులో వ్యాజ్యాలు ఇంకా పరిష్కారం కాలేదని గుర్తుచేసింది. ఇలాంటి సమయంలో అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు ఎలా తరలిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
దీనిపై స్పందించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్... బిల్లులు పెండింగ్‌లో ఉన్న మాట నిజమేనన్నారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఉత్తర్వులేమీ ఇవ్వలేదని చెప్పారు. దీనిపై పూర్తి వివరాలతో 10 రోజుల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అంతలోపు రాజధాని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్‌కు సూచించింది.