తెలంగాణ

telangana

ETV Bharat / city

భాగ్యనగరం.. కన్నీటి సాగరం! - బురదమయమైన హైదరాబాద్ పాతబస్తీ

భాగ్యనగరం కన్నీటి సాగరాన్ని తలపిస్తోంది. కొద్దిరోజులుగా రాజధానిని ముంపు వీడటం లేదు. వందల కాలనీలతో మొదలైన వరద సమస్య వేలాది కాలనీలకు విస్తరిస్తోంది. తగ్గిందనుకునేలోపే మళ్లీ మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

houses damaged with heavy rains in hyderabdad old city
భాగ్యనగరం.. కన్నీటి సాగరం!

By

Published : Oct 21, 2020, 6:51 AM IST

ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టం నుంచి తేరుకోకముందే... మంగళవారం మరోమారు నగరంలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాత్రి పదిగంటల తర్వాత కొద్దిసేపు వాన కురవడంతో అబిడ్స్‌, కోఠి సహా పలుప్రాంతాలు జలమయమయ్యాయి. గరిష్ఠంగా ఉప్పల్‌ బండ్లగూడలో 5.08 సెం.మీ. వర్షం కురిసింది. బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్ల పరిధిలోని అనేక కాలనీలు రెండు నెలలకుపైగా ముంపులో ఉండగా.. నగరంలోని పలు ప్రాంతాలు పది రోజులుగా తడిసి ముద్దవుతున్నాయి.

శివారు ప్రాంతాల నుంచి వరదతో పాటు ప్రధాన నగరంలో కురుస్తున్న వర్షం కూకట్‌పల్లి, అల్వాల్‌, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్‌, మెహిదీపట్నం మధ్యనున్న ప్రాంతాలను అంధకారంలోకి నెట్టింది. కొన్ని కాలనీల్లో సోమవారానికి వరద కాస్త తగ్గుముఖం పట్టినా మంగళవారం వానతో మళ్లీ పెరిగింది. సొంతిళ్లు ఉన్నప్పటికీ రెండు వారాలుగా దాహం, ఆకలి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నామని కొన్ని కాలనీల్లో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో అరకొర వసతులపై జనం ఆగ్రహంగా ఉన్నారు.


వరద సహాయ చర్యల్లో సైన్యం


వరద సహాయక చర్యల్లో భారత సైన్యం సేవలు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రాబోయే రోజుల్లోనూ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇప్పటికే ఉన్న 6 వరద సహాయక బృందాలకు తోడు అదనంగా 9 బృందాలను పడవలతో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.


పొంచి ఉన్న వ్యాధుల ముప్పు


బాధిత కాలనీల్లో ఎక్కడ చూసినా నడుంలోతు వరద లేదా మోకాల్లోతు బురద కనిపిస్తోంది. ముంపు తగ్గినప్పుడు దుర్వాసన రేగుతోంది. క్రిమికీటకాలు, పాములు, పశువులు, ఇతర ప్రాణుల కళేబరాలు తేలుతున్నాయి. సరైన తాగునీరు లేక ప్రజలు జ్వరం, డయేరియా, ఇతర వ్యాధులకు గురవుతున్నారు. వైద్య శిబిరాలు లేకపోవడంతో చాలామంది ఫీవర్‌ ఆస్పత్రికి వరుసకడుతున్నారు.

ఇవీ చూడండి:ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగేందుకు ఆర్మీ బలగాలు సిద్ధం

ABOUT THE AUTHOR

...view details