రాష్ట్ర ప్రభుత్వం తమకు సకాలంలో నిధులు విడుదల చేయడం లేదని, రూ.వందల కోట్ల బకాయిలు పేరుకుపోయాయనే సాకుతో ఈహెచ్‌ఎస్ కార్డులను ‘నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్’ (ఎన్‌ఏబీహెచ్) అనుమతి పొందిన అత్యధిక కార్పొరేట్ ఆసుపత్రులు తిరస్కరిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. 2017లో ప్రభుత్వం నూతన ధరలు ఖరారు చేసిన అనంతరం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో విస్తృత సేవలందించారు.
2016-17 వరకూ ఏడాదికి 55 వేలకు పరిమితమైన కేసులు.. 2017-18లో 92 వేలు దాటాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో 2016-17లో 5 వేల చికిత్సలు అందించగా.. 2017-18లో అయిదింతలకు పైగా (27 వేలు) చేశారు. ఆ సంవత్సరంలో ఔషధ చికిత్సలకూ రూ.10-15 లక్షల బిల్లు వేసిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత నిధులు విడుదల కావడం లేదంటూ ఆరోగ్య కార్డులను కార్పొరేట్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. చికిత్సలు 2018-19లో 18 వేలకు, 2019-20లో 13 వేలకు తగ్గాయి. గత ఏడాది కొవిడ్ కారణంగా చేరికలు నిలిచిపోయాయి. 2020 సెప్టెంబరు నుంచి సాధారణ సేవలను అనుమతించినా.. ఈహెచ్‌ఎస్ కార్డుల కింద రోగులను చేర్చుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందిన సందర్భంలో ఉన్నతాధికారులు తాత్కాలికంగా చొరవ చూపుతున్నా ఆసుపత్రుల తీరు యథావిధిగా మారుతోంది.