తెలంగాణ

telangana

ETV Bharat / city

తుమ్మినా.. దగ్గినా కలవరమే! - Hyderabad hospitals Decline fever patients to treat

కాస్త దగ్గినా.. తుమ్మినా కలవరమే. పరీక్ష చేయించుకుందామని ఆసుపత్రికి వెళ్తే.. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలున్న రోగులను చేర్చుకోవడానికి దవాఖానాలు నిరాకరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకొచ్చింది సాధారణ జ్వరమేనా.. లేక కరోనా లక్షణాలున్నాయా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

hospitals Decline fever and cold patients to treat in telangana
తుమ్మినా.. దగ్గినా కలవరమే!

By

Published : Jun 13, 2020, 8:27 AM IST

కరోనా కేసులు పెరుగుతుండటంతో అనేక ప్రైవేటు ఆసుపత్రులు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు ఉన్న రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయి. ఐసోలేషన్‌లో పడకలు లేవని.. గాంధీ, ఉస్మానియా లేదంటే ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నాయి. ఇదొక ఎత్తయితే అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకుందామన్నా వీలు కావడం లేదని పలువురు వాపోతున్నారు.

కుటుంబంలో ఒకరు వైరస్‌ బారిన పడితే...గతంలో మిగతావారందరి నమూనాలు సేకరించేవారు. మారిన నిబంధనల ప్రకారం లక్షణాలు ఉంటే తప్పా అంగీకరించడం లేదు. కనీసం బాధితులతో కాంటాక్ట్‌లో ఉన్నవారికి సులువుగా పరీక్షలు అందుబాటులో ఉండేలా చేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.

దోమలగూడకు చెందిన వ్యక్తి(65) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఓ ల్యాబ్‌లో పరీక్ష చేసుకుంటే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు తేలింది. రెండు, మూడు ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదిస్తే పడకలు లేవంటూ నిరాకరించారు. ఫీవర్‌ ఆసుపత్రికి వెళ్తే అక్కడా అదే పరిస్థితి. కింగ్‌కోఠికి వెళ్తే వెంటిలేటర్ల కొరత ఉందని చెప్పి ఛాతీ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు.

వాతావరణంలో మార్పులతో..

వాతావరణ మార్పులతో సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం చాలామందిలో వస్తుంటాయి. ప్రస్తుత కరోనా వేళ అవి ఉంటే అనుమానంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడ అనుకున్నంత సులువుగా చేర్చుకోవడం లేదు. కనీసం పరీక్షలకు అంగీకరించడం లేదు. సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 20 ఐసీయూ పడకలు ఉంటే నిండిపోయాయి. ప్రస్తుత వాతావరణం వల్ల జలుబు, దగ్గు సాధారణమేనని.. ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణ వైరల్‌ జ్వరమైతే 3-5 రోజుల్లో తగ్గిపోతుందని, ఆ తర్వాతా ఉంటే అనుమానించాలన్నారు. జ్వరం పెరుగుతున్నా, ఊపిరి తీసుకోవడం కష్టమైనా, పొడి దగ్గు ఎక్కువగా ఉన్నా వైద్యులను కలవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చుకోకపోతే కింగ్‌కోఠి లేదా ఫీవర్‌ ఆసుపత్రికి వెళ్లాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details