తెలంగాణ

telangana

ETV Bharat / city

Command Control Center : 'కమాండ్‌ కంట్రోల్‌తో రాష్ట్రంలో భద్రత మరింత పటిష్ఠం' - Home minister at command control center

Command Control Center : ఆధునిక హంగులతో.. దేశానికే తలమానికంగా నిలవనున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవానికి ముస్తాబైందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ సెంటర్ ప్రారంభం కానుందని తెలిపారు. మంత్రి తలసాని, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మహమూద్ అలీ సందర్శించారు.

Command Control Center
Command Control Center

By

Published : Aug 2, 2022, 12:25 PM IST

Command Control Center : దేశానికే తలమానికంగా నిలువనున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనులు పూర్తయ్యాయని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆధునిక హంగులతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రూపుదిద్దుకున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ అధికారులతో కలిసి మహమూద్‌ అలీ సందర్శించారు.

Command Control Center in Hyderabad : కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు సంబంధించిన విషయాలను డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వారికి వివరించారు. అన్ని శాఖలను అనుసంధానం చేస్తూ రూపుదిద్దుకున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో హైదరాబాద్‌లో భద్రత మరింత పటిష్ఠం కానుందని హోంమంత్రి తెలిపారు. 600కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో.... జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్‌ దేశాల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు మంత్రి తలసాని వివరించారు.

ఐదు టవర్లు.. ఒకేసారి లక్ష సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు భారీ వీడియో వాల్‌.. 30 పెటాబైట్ల సామర్థ్యం ఉన్న సర్వర్లు.. కృత్రిమ మేధ వినియోగం.. డీజీపీ, కమిషనర్‌ ఛాంబర్లు.. ఓ టవర్‌పైన హెలిప్యాడ్‌.. హైదరాబాద్‌ నగర నడిబొడ్డున నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలివి. రాష్ట్రంలో ఏ మూలన ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలనైనా ఇక్కడ వీక్షించవచ్చు. శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడూ కీలక శాఖలను ఇక్కడి నుంచి అప్రమత్తం చెయ్యొచ్చు. ఈ కేంద్రంలో ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే పోలీసింగ్‌లో దేశానికే తలమానికంగా నిలవనుంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(కృత్రిమ మేధ) సాంకేతికత వినియోగించి దృశ్యాలను విశ్లేషించనున్నారు. ఉదాహరణకు ఎవరైనా అనుమానితుడు రాష్ట్రంలోకి వచ్చినట్లు సమాచారముంటే చాలు.. అతడి ఫొటోను డేటాతో అనుసంధానం చేస్తారు. అతడు రాష్ట్రంలోని ఏ సీసీ కెమెరా పరిధిలోకి వచ్చినా కృత్రిమ మేధ పరిజ్ఞానం ద్వారా సమీపంలోని పోలీసులను కంప్యూటరే అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి అనలిటికల్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన కెమెరాల్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎక్కువగా ఏర్పాటు చేసి.. సెంటర్‌కు అనుసంధానించనున్నారు. ఆటోమేటిక్‌ వెహికిల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌తో కూడిన కెమెరాలను మరింత నిశితంగా విశ్లేషించి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించనున్నారు. పీటీజడ్‌(360 డిగ్రీల కోణంలో తిరిగే) కెమెరాల ఫీడ్‌నూ సమర్థంగా విశ్లేషించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details