తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా కట్టడికి పోలీస్‌ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోంది: హోంమంత్రి - telangana news

కరోనా కట్టడికి పోలీస్‌ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పోలీస్ శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంజక్షన్లు, మందులు నల్లబజార్‌లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

home minister mahamood ali
కరోనా కట్టడికి పోలీస్‌ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తోంది: హోంమంత్రి

By

Published : Apr 28, 2021, 9:21 PM IST

గత సంవత్సర కాలంగా కరోనా తీవ్రతలో కూడా పోలీసు శాఖ సమర్ధవంతంగా పనిచేసిందని హోం మంత్రి మహమూద్​ అలీ పేర్కొనారు. రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పోలీస్ శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలపై హోం శాఖ ప్రధాన కార్యదర్శి రవి గుప్త, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్​లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో పోలీస్ శాఖ ముందు ఉంటుందని, ఎప్పటిలాగే క్రియాశీల పాత్ర పోషిస్తోందని... ప్రజారోగ్య, జీహెచ్​ఎంసీ శాఖలతో సమన్వయంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, రెమిడెసివిర్ ఇంజక్షన్ ఇతర మందులు అన్ని ఆసుపత్రులలో సిద్దంగా ఉంచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్న ఆయన...చాలామంది భయంతో, ముందు జాగ్రత్తతో, ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజక్షన్లు ఇళ్లల్లో నిలువ చేసుకొంటున్నట్లు దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఇందువల్ల సిలిండర్ల తాత్కాలిక కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, అదేవిధంగా మందులు పాడైపోయే ప్రమాదం ఉందన్నారు. ఇంజక్షన్లు మందులు బ్లాకు మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిపారు. రంజాన్ మాసం నడుస్తున్న కారణంగా ముస్లీం సోదరులు నమాజ్, తరావీలు చేసే సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసారు. ప్రస్తుతం హైదరాబాద్ మెడికల్ హబ్​గా ఉందని, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్​కు చికిత్స కొరకు ప్రజలు వస్తున్నారని, ప్రభుత్వం ప్రజల చికిత్స కొరకు అన్ని చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలో వదంతులు, ఇతర అసత్య ప్రచారాలకు పాల్పడితే, కఠిన చర్యలు తప్పవని హోం మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌

ABOUT THE AUTHOR

...view details