ఏపీలో ప్రస్తుతం 50 వేల మందికిపైగా హోం ఐసొలేషన్లో ఉన్నారు. ఆసుపత్రులపై భారం తగ్గించేందుకు కొవిడ్ లక్షణాలు తక్కువగా ఉన్న వారిని హోం ఐసొలేషన్లో ఉంచుతున్నారు. వీరి బాగోగుల పర్యవేక్షణ సరిగా లేదు. సరైన వైద్య సలహాలు అందకపోవడంతో బాధితులు ఆందోళనకు గురై సొంతంగా మందులు వాడుతున్నారు.
పట్టించుకునే వారేరీ?
- ఒంగోలులో ఓ మధ్య వయస్కురాలికి ఈ నెల తొలివారంలో కరోనా సోకగానే ఆరోగ్య సిబ్బంది నుంచి హడావుడిగా ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిరోజుల నుంచి ఆమె ఆరోగ్యం గురించి విచారించేవారు కరవయ్యారు. మరో కుటుంబంలో ఏడుగురికి గత నెలలో పాజిటివ్ రాగా ముగ్గురు హోం ఐసొలేషన్లో ఉన్నారు. వీరి వివరాలను ఆరోగ్య సిబ్బంది సేకరించనే లేదు.
- విశాఖతోపాటు శివారు మండలాల్లో ఇళ్లలో ఉండే కొందరికి మందులు అందలేదు.
- తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇళ్లలో ఉన్న బాధితులు గురించి పట్టించుకునేవారు కరవయ్యారు.
- విజయవాడలోని మధురానగర్, అన్నపూర్ణానగర్, ఇతర చోట్ల హోం ఐసొలేషన్లో ఉన్న వారూ ఇబ్బందులు పడుతున్నారు.
- ఇంట్లోనే ఉంచి చికిత్సలు పొందుతున్న వారి నమూనాలను పది రోజుల తర్వాత పరీక్షించాలి. ఈ పరీక్షల నిర్వహణలోనూ జాప్యం నెలకొంది.
- వైరస్ సోకి అనుమానిత లక్షణాలు లేకుండా, ఇంట్లో సౌకర్యాలున్న వారికే హోం ఐసొలేషన్ అనుమతి ఇస్తున్నామని, మిగతా వారిని కొవిడ్ కేర్ సెంటర్లకు, ఆసుపత్రులకు తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.