కూరగాయలు పండించాలంటే... ఎకరమో అరెకరమో భూమి... రసాయనాలు.. ఇవన్నీ ఉండాలనుకుంటున్నారా? కానేకాదు.. ఇవేవీ అక్కర్లేదు... మీ ఇల్లే ఓ చేను... మీ డాబానే ఓ పొలం... అపార్ట్‌మెంటైతే... మీ బాల్కనీ కూడా చాలు... పాతబడ్డ బకెటో... పాడైపోయిన డ్రమ్మో... మీ పాల డబ్బానో... ఖాళీ ఉప్పు ప్యాకెటైనా... ఏదైనా చాలు... మీ ఇంటికి అవసరమైన కూరగాయలు... వీలైతే కొన్ని పూలు.. కుదిరితే కొన్ని పండ్లు కూడా పండించుకోవచ్చు... నిశ్చింతగా స్వచ్ఛమైన తిండి తినొచ్చు... నెలవారీ ఖర్చులూ ఆదా చేసుకోవచ్చు! కావల్సిందల్లా... కాసింత పెట్టుబడి... రోజూ ఓ గంట ఓపిక... శ్రద్ధ! అంతే!
ఇంటింటా మిద్దె పండగ..!
నిన్న..మొన్నటి వరకూ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు కొనేందుకు రైతుబజార్లు, మార్కెట్‌లకు వెళ్లేవారు. రసాయనాల వినియోగం, రోజుల తరబడి నిల్వ ఉంచటంతో తాజాదనం.. రుచి తగ్గేవి. ధరల్లో స్థిరత్వం లేకపోవడం. వీటి నుంచి బయటపడేందుకు.. పలువురు ఇంటిని, ఇంట్లోని డాబాలను పంట స్థలంగా మార్చుకుంటున్నారు. అందుబాటులోకి వచ్చిన సాగు పద్ధతులను అవలంబిస్తూ మిద్దెతోటలతో సొంతగా కుటుంబానికి అవసరమైన ఫలసాయం పొందుతున్నారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్ ప్రజలకు అవసరమైన కాయగూరలు.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, మెదక్ తదితర జిల్లాల నుంచి వచ్చేవి. వేసవికాలం, అకాలవర్షాల కారణంగా తలెత్తిన ఇబ్బందులు సాగును దెబ్బతీసేవి. ఆ సమయాల్లో ఆకాశాన్నంటిన ధరలు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపేవి.
మేం కూరగాయలు కొనక నెలలైంది
మేం కూరగాయలు కొనక కొన్ని నెలలవుతోంది. లాక్‌డౌన్‌లోనూ పండ్ల కోసం బయటకు వెళ్లలేదు. ఇరుగు పొరుగు కుటుంబాలూ ఆడపాదడపా మా పెరట్లోనే కోసుకెళ్లేవారు. 500-550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వంకాయ, టమాటా, క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్, మందారం, గులాబీలు, అన్ని రకాల తులసి మొక్కలు పెంచుతున్నాం. దానిమ్మ, నిమ్మ, నేరేడు చెట్లూ ఉన్నాయి. ప్రతినెలా ఇంటి బడ్జెట్‌లో రూ.2000-2500 వరకూ ఆదా. కూరలు త్వరగా ఉడుకుతున్నాయి. రుచిగా ఉంటున్నాయి.
- ఎం.సుధాకర్, విశ్రాంత శాస్త్రవేత్త, హబ్సిగూడ, హైదరాబాద్
రెండు నెలలుగా మార్కెట్‌కు వెళ్లలేదు
ఏపీలోని గుంటూరు వేణుగోపాల్‌నగర్‌కు చెందిన బసవపున్నయ్య, కృష్ణకుమారి దంపతులు... మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రెండు నెలలుగా మిద్దె తోటలో పండే కూరగాయలనే వాడుతున్నారు. బంగాళదుంప, ఉల్లిపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిద్దె పంటకు జింక్ పైపులతో స్టాండ్‌లు చేయించారు. ‘‘మన ఇంట-సేంద్రియ పంట’’ అనే వాట్సప్ గ్రూప్ ద్వారా సభ్యులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఏడు గంటలకు అమెరికాలో ఉంటున్న మనవరాలికి వీడియో ద్వారా మిద్దె తోటను చూపడంతో పనులను ప్రారంభిస్తారు.
2వేల దాకా ఆదా...
- జ్యోత్స్నరాణి, మూసారాంబాగ్, హైదరాబాద్
కాస్త సమయం కేటాయిస్తూ.. ఓపిక వహిస్తే చాలు. మిద్దెతోట పంటతో ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండొచ్చు. మా టెర్రస్‌పై బెండ, దోస, ఆకుకూరలు, టమోటా సాగు చేస్తున్నాం. ప్రతి నెలా సగటున రూ.2000-3000 వరకూ పొదుపు చేస్తున్నాం. డబ్బులను మించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం.
ఇంటితోట ప్రకృతి వరం
* ప్రోత్సహిస్తే నగర/పట్టణాల్లో 90 శాతం కూరగాయలు, పండ్ల అవసరాలను మిద్దెతోటలు తీరుస్తాయి.
* అధికశాతం అపార్ట్‌మెంట్స్, విల్లాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
* ఇంటిపంట సాగులో సరైన సాధన అవసరం. భూమ్మీద వ్యవసాయానికి దీనికీ కొంత తేడా ఉంటుంది.
* అడుగు ఎత్తులో ఇటుక, సిమెంట్‌తో మడులను ఏర్పాటు చేసుకోవటం ద్వారా టెర్రస్‌కు నీరు, మట్టి అంటదు* తెగుళ్లు సోకిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. పురుగులను చేతితో తీసి పారేయొచ్చు.
* ఎండిన ఆకులు, వ్యర్థాలతో సేంద్రియ ఎరువును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.