తెలంగాణ

telangana

ETV Bharat / city

Terrace garden: ఆ ఊరిలో ఇంట్లో చెత్తను నల్లబంగారంగా మారుస్తున్నారు.. ఎలా అంటే..! - 3000 terrace gardens

ఒకరూ... ఇద్దరూ కాదు... ఏకంగా మూడువేల మంది మహిళలు ఇంటింటా నల్లబంగారాన్ని తయారు చేస్తున్నారు! ఆసక్తే పెట్టుబడిగా పెట్టిన ఈ వ్యాపారంతో తమ కుటుంబాలకి ఆరోగ్యసిరులు కురిపిస్తున్నారు.. ఇంతకీ ఏంటా నల్ల బంగారం అంటారా?... ‘సేంద్రియ ఎరువు’. ఇంటిచెత్తనేఎరువుగా మార్చి... మిద్దెతోటలకి ప్రాణం పోస్తున్నారు విజయనగరం మహిళలు..

home-composting-with-terrace-gardens-in-vizianagaram
home-composting-with-terrace-gardens-in-vizianagaram

By

Published : Jun 27, 2021, 12:21 PM IST

మీ ఇంట్లో రోజూ పోగయ్యే చెత్తను ఏం చేస్తారు? ‘ఏం చేస్తాం.. బయట పారేస్తాం’ అంటారు కదా! కానీ విజయనగరం మహిళలు మాత్రం విలువైన సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఇలా ఒకరో ఇద్దరో కాదు... మూడు వేల మంది మహిళలు నల్లబంగారాన్ని తయారు చేసుకుని దాంతో నాణ్యమైన కాయగూరలు పండించడం విశేషం.

ఏపీలోని విజయనగరం నగర పాలకసంస్థ రెండేళ్ల కిందట ‘హోమ్‌ కంపోస్టింగ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల సహకారంతో ఇళ్లలో తడి చెత్తని సేంద్రియ ఎరువుగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. పారిశుద్ధ్య కార్మికులకు, నగరపాలక సంస్థకు సవాల్‌గా మారిన తడిచెత్తకు పరిష్కారంతోపాటు ప్రజలకు చక్కని ఆరోగ్యం బోనస్‌లా లభిస్తుందని అధికారులు ఆశించారు. ముందుగా మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న మహిళలను గుర్తించారు. వారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. తడిచెత్తతో ఎరువును ఎలా తయారు చేసుకోవాలో అవగాహన కల్పించారు. ఎరువు తయారీ కోసం ఒక్కో ఇంటికీ 40 కిలోల సామర్థ్యం కలిగిన రెండు డ్రమ్ములని ఉచితంగా ఇస్తారు. ఇలా 6500 డ్రమ్ములని ఉచితంగా పంపిణీ చేశారు. దీనికి మహిళల ఉత్సాహం కూడా తోడయ్యేసరికి కొద్ది కాలంలోనే మంచి ఫలితాలు మొదలయ్యాయి. ఇప్పుడు మూడు వేల ఇళ్లల్లో హోం కంపోస్టింగ్‌ విజయవంతంగా సాగుతోంది. నగర కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ ఆలోచనలో పుట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయనే పర్యవేక్షిస్తున్నారు.

ఎస్‌డబ్ల్యూఎం(సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌) లెక్కల ప్రకారం నలుగురు ఉన్న ఒక ఇంటి నుంచి రోజుకి కిలో తడిచెత్త పోగవుతుంది. పొడి చెత్తను రీసైక్లింగ్‌ కోసం వినియోగించవచ్చు. కానీ తడిచెత్తను అలాచేయలేం. కొండలా పేరుకుపోయే ఈ చెత్తతో అనారోగ్య సమస్యలూ వస్తాయి. ఈ తడి చెత్త నిర్వహణ తలనొప్పిగా మారుతోంది. నగరంలో రోజుకు 48 టన్నుల తడిచెత్తను సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ సమస్యకు చక్కని పరిష్కారం అందించింది. ఈమేరకు పారిశుద్ధ్య సిబ్బందికీ సేకరణ భారం కొంత తగ్గింది. ఈ కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధిస్తున్న వారిలో ఏటా నలుగురైదుగురిని అధికారులు సత్కరిస్తున్నారు. ఈ చెత్త నిర్వహణను పర్యవేక్షించే ‘నగర దీపికలు’ ప్రతి వారం ఒకరి ఇంటికి వెళ్లి పరిశీలిస్తారు. సలహాలూ ఇస్తారు. చెత్తలేకపోవడం, సహజ పంటలు... ఇలా రెండు రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తోందని, మంచి వ్యాపకంగా మారిందని, ఖర్చు కూడా కొంత కలిసి వస్తోందని మహిళలు సంతోషంగా చెబుతున్నారు. చాలామంది మహిళలు తమ వద్ద అదనంగా ఉన్నవాటిని ఇతరులతో ఇచ్చి పుచ్చుకుంటున్నారు. నగరంలో సుమారు 90 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ ఏడాది కనీసం 15 శాతం అంటే 13,500 కుటుంబాలను ఇటువైపు మళ్లించేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది.

-కొమరవెళ్లి మునీందర్‌, విజయనగరం

‘‘మొదట్లో నేను మొక్కలకోసం రసాయన ఎరువులు వాడేదాన్ని. సేంద్రియ ఎరువు తయారీ నేర్చుకున్నాక ఇప్పుడు పూర్తిగా ఇదే వినియోగిస్తున్నాను. కూరగాయలు బయట కొనడం లేదు. మా ఇంట్లో అద్దెకుండే వారికీ ఇస్తుంటాం.’’

- సెల్గంశెట్టి కృష్ణవేణి, తూర్పు బల్జివీధి

‘‘ఏడాదిగా మా ఇంటి ఎరువుతోనే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నా. తెలిసిన వారికీ పంపిస్తుంటాను.’’

- జి.పుష్పకుమారి, బాబామెట్ట

‘‘రెండేళ్లుగా సేంద్రియ ఎరువుని ఇంట్లోనే తయారు చేసి కూరగాయలు పండిస్తున్నా. చాలా రుచిగా ఉంటున్నాయి. వీటిని చూసి ఇరుగూ, పొరుగూ కూడా ఆకర్షితులవుతున్నారు.’’

- ముద్దంశెట్టి జానకి, పడమటి బల్జివీధి

ఇదీ చూడండి:Revanth reddy: స్వతంత్ర జడ్పీటీసీ నుంచి టీపీసీసీ​ అధ్యక్షుడిగా..

ABOUT THE AUTHOR

...view details