తెలంగాణ

telangana

ETV Bharat / city

HOLI FESTIVAL: హోలీ పండగకు ఎన్నో పేర్లు.. వాటి ప్రాముఖ్యత మీకు తెలుసా? - తెలంగాణ వార్తలు

HOLI FESTIVAL: భారతీయ సంప్రదాయంలో హోలీ పండగ చాలా ప్రాచీనమైనది. వసంత రుతువుకు స్వాగతం చెబుతూ ఉత్సాహంగా జరుపుకొనే రంగుల పర్వదినమిది. ఈ వేడుకకు ఎన్నో పేర్లు, మరెన్నో పరమార్థాలు ఉన్నాయి. రంగుల పండగ ప్రాముఖ్యతను మనమూ తెలుసుకుందాం.. రండి...

HOLI
HOLI

By

Published : Mar 18, 2022, 5:56 AM IST

Updated : Mar 18, 2022, 6:29 AM IST

HOLI FESTIVAL : సంత రుతు శోభకు వర్ణమయంగా, సౌందర్యయుతంగా స్వాగతం పలికే రంగుల పండుగ- హోలీ! వాసంత సౌకుమార్యాన్ని రంగుల హొయలతో, ఆనందార్ణవంగా ఈ పర్వం ప్రతిఫలింపజేస్తుంది. ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి సంకేతంగా ఫాల్గుణ పౌర్ణమినాడు రంగుల్ని చిలకరించుకుంటారని లింగపురాణం ప్రస్తావించింది. ఫాల్గుణ పౌర్ణమికి అటుఇటుగా, ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి సంబంధితమైన వేడుకల్ని నిర్వహించుకునే సంప్రదాయం ఉంది. సామాజిక సమైక్యతను, సమష్టి భావనను ఈ పండుగ వ్యక్తీకరిస్తుంది. ఫాల్గుణ, చైత్రమాసాల సంధికాలంలో జరుపుకొనే ఈ పండుగ విశేషాలను భవిష్య, నారద పురాణాలతో పాటు గాథా సప్తశతి, మాళవికాగ్నిమిత్రం, నాగావళి వంటి గ్రంథాలు పేర్కొన్నాయి. వసంతోత్సవం, మధూత్సవం, మదనోత్సవం, కాముని పున్నమి, డోలోత్సవం, శ్రీకృష్ణగోపికా ప్రేమోత్సవంగా ‘హోలీ’ని వ్యవహరిస్తారు.

కామదహనం...

హోలీతో ముడివడిన ప్రధాన గాథ- కామదహనం. తన తపస్సును భగ్నం చేసిన మన్మథుణ్ని, ఈశ్వరుడు తన మూడో కన్ను తెరిచి ఫాల్గుణ పౌర్ణమినాడే భస్మం చేశాడని శివమహా పురాణం పేర్కొంది. ఈ ఘట్టమే కుమారసంభవానికి, తారకాసుర సంహారానికి ప్రాతిపదిక! అగ్ని సైతం దహించలేని మహాశక్తిమంతు రాలైన హోలిక, హిరణ్యకశిపుడి సోదరి. హరి స్మరణ వీడని తన కుమారుడిని, ఆమె ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని హిరణ్యకశిపుడు తన సోదరిని ఆదేశిస్తాడు. హరి భక్తుడైన ప్రహ్లాదుడి స్పర్శవల్ల హోలిక శక్తి పూర్తిగా క్షీణించి, ఆమె అగ్నికి ఆహుతి అవుతుంది. ప్రహ్లాదుడు అగ్ని కీలల నుంచి క్షేమంగా బయటకు వస్తాడు. అలా, హోలిక దగ్ధం అయినా ఫాల్గుణ పౌర్ణమినే, ప్రహ్లాద పౌర్ణమి అంటారు. కృతయుగంలో ‘దుంధ’ అనే రాక్షసి అంతానికి ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ జరుపుకొనే సంప్రదాయం ఏర్పడిందని ‘చండీతంత్రం’ వివరించింది. మధుర మీనాక్షి తపోదీక్షతో సుందరేశ్వర స్వామిని మెప్పించి ఫాల్గుణ పౌర్ణమినాడు వివాహమాడిందని చెబుతారు. అందుకే దక్షిణ భారతదేశం లోని ఆలయాల్లో కల్యాణవ్రతం పేరిట హోలీనాడు శివపార్వతుల కల్యాణాన్ని నిర్వహించి, హోలికా మిశ్రమాన్ని నివేదించి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఫాల్గుణ పౌర్ణమినుంచి చైత్ర పౌర్ణమివరకు నెలరోజులపాటు మామిడిపూత, వేపచిగుళ్లు, తేనె కలిపిన ‘హోలికా మిశ్రమం’ స్వీకరించడం వల్ల వేసవి తాపం తొలగుతుందని చరక సంహిత తెలియజెబుతోంది. హోలీనాడు జనావాస కూడళ్లలో పెద్ద జ్వాలను ఏర్పాటు చేసి, ఆ అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అగ్ని ప్రసాదమైన భస్మాన్ని నుదుట ధరిస్తారు. ఈ భస్మాన్ని ధరించడం వల్ల సకల సానుకూల శక్తులు పెంపొంది, ప్రతికూల శక్తులు దూరమవుతాయని విశ్వాసం.

ఉత్తర భారతాన ‘డోలాజాత్రా’గా...

యమునాతీరం బృందావనంలో రాసక్రీడల్లో భాగంగా శ్రీకృష్ణుడు, గోపికలపై వసంతాన్ని చిలకరిస్తే- గోపికలు ప్రేమాతిశయంతో మురళీమనోహరుడిపై పన్నీరు, పుష్పాల్ని విరజిమ్మారని శ్రీమద్భాగవతం వసంతోత్సవ వైభవాన్ని వర్ణించింది. రాధాకృష్ణుల రసరమ్య భావనా వాహినికి సంకేతంగా హోలీపర్వం ఉత్తర భారతాన ‘డోలాజాత్రా’గా వెల్లివిరుస్తుంది. ఫాల్గుణ శుద్ధ అష్టమినుంచి పౌర్ణమి వరకు ఉండే ఎనిమిది రోజుల్ని ‘హోలాష్టకం’ అంటారు. అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాల్ని, దశమహా శక్తుల్ని ఈ ఎనిమిది రోజులపాటు నవధాన్యాలతో పూజించే ఆచారం ఉంది. హోలీనాడు దేవతలకు ఉద్వాసన పలికి, వారి మూర్తులపై పన్నీరు కలిపిన చందనాన్ని చిలకరించడమే హోలీ వేడుకగా వ్యాప్తి చెందిందని, విశ్వసిస్తారు. ప్రేమైక జీవన సౌందర్యాన్ని, సమైక్య భావనా మాధుర్యాన్ని ప్రమోదంగా ప్రకటించే పర్వం రంగులకేళి- హోలీ!

ఇదీ చదవండి:ఇహానికి.. పరానికి రంగుల పున్నమి!

Last Updated : Mar 18, 2022, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details