Hoarding Against Modi : జులై 2 నుంచి హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. జులై 3న ప్రధాన మంత్రి మోదీ భాగ్యనగరానికి రానున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మోదీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో యాండీ మోదీ, యాంటీ భాజపా పోస్టులపై దృష్టి సారించి.. డిజిటల్ కూంబింగ్ కూడా మొదలు పెట్టింది.
'చాలు మోదీ.. చంపకు మోదీ.. బై బై మోదీ'
Hoarding Against Modi : మోదీ హైదరాబాద్ పర్యటన దృష్ట్యా రాష్ట్ర పోలీసు యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. మరోవైపు డిజిటల్ కూంబింగ్ కూడా షురూ చేసింది. ఈ క్రమంలో మోదీ బహిరంగ సభ జరగనున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ప్రధానికి వ్యతిరేకంగా హోర్డింగులు, బ్యానర్లు వెలవడం కలకలం సృష్టించింది.
Hoarding Against Modi in hyderabad : ఈ క్రమంలో నగరంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్ వెలవడం చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో టివోలీ థియేటర్ ఎదురుగా మోదీకి వ్యతిరేకంగా హోర్డింగులు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. తెలంగాణకు చేసిందేమీ లేదంటూ.. 'సాలు మోదీ.. సంపకు మోదీ.. బై..బై.. మోదీ' అంటూ బ్యానర్లు కనిపించాయి. మోదీ బహిరంగ సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఈ హోర్డింగ్‌లు, బ్యానర్లు కలకలం సృష్టించాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు హోర్డింగ్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఆ హోర్డింగ్‌లు ఎవరు పెట్టారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. మోదీ పర్యటన దృష్ట్యా భద్రతాలోపం ఉండకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నగరంలో మోదీకి వ్యతిరేకంగా ఉన్న హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించారు.