సంక్రాంతి పర్వదినాన పూర్వంలో వేకువజామునే హరిదాసు ఊర్లోకి వచ్చి, నెత్తిన అక్షయపాత్ర, ఓ చేతిలో చిడతలు, మరో చేతిలో తంబూర పట్టుకొని భక్తిరస హరి కీర్తనలతో భిక్షాటన చేస్తూ ఉండేవారు. దానం స్వీకరించే సమయంలో హరిదాసు వినమ్రంగా క్రిందకి వంగి నెత్తి అక్షయ పాత్రలో దాన్ని స్వీకరించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గంలో సరికొత్త భిక్షాటనకు శ్రీకారం చుట్టారు హరిదాసులు.
ఇప్పుడంతా హైటెక్ కాలం. వీధీ..వీధీనా నడిచే పనిలేకుండా నెత్తిన అక్షయ పాత్ర మోయకుండా హరి కీర్తన సైతం పాడకుండా కొత్త విధానానికి తెరలేపారు. తలపై ఉండాల్సిన అక్షయపాత్రను బైక్ హెడ్ లైట్ వద్ద అమర్చుకొని... తీరిగ్గా కూర్చొని ఇళ్లిల్లు తిరుగుతూ... నోటికి పని చెప్పకుండా టేప్ రికార్డుకు సౌండ్ బాక్సులు పెట్టేసి హరికీర్తనను ఓ రేంజ్లో వినిపిస్తున్నారు.