తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభువు జీవితంలోని చివరిఘట్టాలు.. ప్రజలకు అమృతత్వపు పాఠాలు

చావుపుట్టుకలు ఉచ్ఛ్వాస, నిశ్వాసల్లా అవిభాజ్యాలు. ఎప్పుడు పుట్టుక సంభవిస్తుందో అప్పుడే చావు రాసి పెట్టి ఉంటుంది. అనివార్యమైన మృత్యువు నుంచి తప్పించేవి ధైర్యం, త్యాగాలే. వాటితో శాశ్వతత్వం వస్తుంది. అమృతత్వం సాధ్యమవుతుంది. దీన్ని క్రీస్తు తన జీవితంలో నిరూపించారు. ప్రభువు జీవితంలోని చివరిఘట్టాలు అమృతత్వాన్ని ఎలా సాధించాలో చాటి చెబుతాయి. గుడ్​ఫ్రైడ్​ సందర్భంగా ఏసు త్యాగాన్ని స్మరించుకుందాం.

history of good friday
history of good friday

By

Published : Apr 1, 2021, 9:43 PM IST

ఒక కమ్మరి చక్రంపై మట్టి ముద్దను ఉంచుతాడు. అది ప్రారంభంలో విరిగిపోయి వికృతంగా మారినా తన చేతులతో మళ్లీ సరిచేస్తాడు. ఆ మట్టి ముద్ద మంచి ఆకృతిగల పాత్రగా మారేవరకు అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు. మట్టి ముద్దలాంటి మనుషులను మహోన్నతులుగా మలిచేందుకు ప్రభువు సిలువపై బలియాగానికి సిద్ధమయ్యారు. అలా ఆయన ప్రజల పాపాలను ప్రక్షాళన చేసేందుకు మరణానికి సిద్ధపడ్డరోజు శుభ శుక్రవారమైంది.

క్రీస్తు సిలువపై మరణించి మూడో రోజు లేచారు. అదే ఈస్టరు పర్వదినం. ఈ దేహం మాత్రమే నేను అనుకునే మనిషి ఎన్నో పాప కార్యాలకు సిద్ధమవుతాడు. దేహంలో ఉన్న ఆత్మమాత్రమే శాశ్వతం అనుకునే వ్యక్తి విద్వేషాల నుంచి విడుదలవుతాడు. నిరంతరం ప్రేమను పంచుతుండేవారికి స్వర్గం సొంతమవుతుంది. అదే జీవం అసలు రూపం. అని ఆయన చాటారు.

క్రీస్తు ప్రభువు శిష్యుడైన యోహాను యేసు ప్రేమను అగాపే అనే గ్రీకు మాటలో వర్ణించారు. అంటే నిష్కళంకమైంది అని అర్థం. ఆ ప్రేమ ఎంత ఉన్నతమైందో ఆయన ప్రపంచానికి చాటారు. అతని పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముప్పై నాణేల కోసం ప్రభువును మతాచార్యులకు అప్పగించాడు. అలా చేస్తాడని ముందే తెలిసినా, ప్రభువు ముందురోజు రాత్రి విందులో యూదాకు ప్రేమగా ఆహారాన్ని తినిపించి ‘నువ్వు చేయాల్సిన పనిని త్వరగా పూర్తిచేయి’’ అన్నారు . తనను చావు వైపు తీసుకెళ్లిన వ్యక్తిని కూడా ప్రేమించారు ప్రభువు. సైనికులు బంధించినప్పుడు ‘మీరు నన్ను బంధించండి. నా శిష్యులను వదిలిపెట్టండి’ అనడం త్యాగంతో కూడి తెగువకు నిదర్శనం.

యూదు ధర్మజ్ఞులు విశ్రాంతి దినాన ముప్ఫై తొమ్మిది పనులు చేయకూడదని నిషేధం విధించారు. ప్రభువు ఆ ఆజ్ఞలను పాటించలేదు. మానవాళికి మంచి చేసే ప్రతి పనినీ చేశారు. విశ్రాంతి దినాల్లో రోగులకు చికిత్స చేశారు. దేవాలయ ప్రాంగణం నుంచి వ్యాపారులను బయటకు తరిమారు. శాంతి కరుణ ప్రేమలతో పరలోక రాజ్య ప్రవేశం గురించి ప్రవచిస్తున్న క్రీస్తు తమకు పోటీగా రాజ్యాధికారం చేపడతాడని ఆనాటి మతాధికారులు, పాలకులు భావించారు. ఆయనపై ఆరోపణలు చేసి విచారణకు నిలబెట్టారు. ప్రభువు ఎక్కడా సంయమనం, స్థైర్యం కోల్పోలేదు. తాను నమ్మిన మార్గాన్ని, ధర్మాన్ని వివరించారు. విశ్రాంతిదినాన చనిపోతున్న మనిషికి స్వస్థత చేకూర్చడం పాపమా? పవిత్రమైన దేవాలయాన్ని వ్యాపారకేంద్రంగా మార్చారని ప్రశ్నించడం నేరమా? అంటూ వారిని ఎదుర్కొన్నారు. చివరకు సత్యం కోసం బలియాగానికి సిద్ధపడ్డారు.

క్రీస్తుపై విచారణకు ఆనాటి చక్రవర్తి నియమించిన న్యాయాధికారి పొంతి పిలాతు. ఆయనకు క్రీస్తును శిక్షించడం ఇష్టం లేదు. ప్రభువు నిష్కళంకుడని బలంగా నమ్మాడాయన. ఆయన క్రీస్తును ఎన్నోవిధాలుగా ప్రశ్నించాడు. తాను నిరపరాధినని, శిక్ష వేయకుండా చూడమని క్రీస్తు వేడుకుంటారని చూశాడు. కానీ సత్యం మాత్రమే శాశ్వతమని నమ్మిన ప్రభువు ధైర్యంగా మరణ శిక్షకే మొగ్గుచూపారు. క్రీస్తు ధైర్యసాహసాలకు ఆశ్చర్యపోయిన పిలాతు తీర్పు చెప్పిన తర్వాత కూడా ఎంతో ఆవేదన చెందాడు.

ఇదీ చూడండి: 'కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గుడ్​ప్రైడే ప్రార్థనలు జరుపుకోండి'

ABOUT THE AUTHOR

...view details