రాష్ట్ర సర్కార్‌తో కోకాకోలా సంస్థ ఒప్పందం Hindustan Coca cola Beverages : రాష్ట్ర ప్రభుత్వంతో హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో.. తెలంగాణలో అదనపు పెట్టబుడులు పెట్టడంతో పాటు కొత్త పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందం జరిగింది. రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి హిందుస్థాన్ కోకాకోలా సంస్థ ముందుకొచ్చింది.
సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో నూతన పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దీనికోసమై కోకాకోలా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 48.53 ఎకరాలు కేటాయించింది. ఇందులో మహిళలకు అత్యధికంగా ఉపాధి కల్పిస్తామని కోకాకోలా సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ సంస్థ సంగారెడ్డి, అమీన్‌పూర్‌లో పరిశ్రమలు నిర్వహిస్తోంది.
"కోకాకోలా సంస్థ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అందులో భాగమైన హిందూస్థాన్ కోకాకోలా బేవరేజెస్ 25 ఏళ్లుగా మంచి సేవలు అందిస్తోంది. వ్యర్ధాల నిర్వహణ, నీటి నిర్వహణ తదితర అంశాలపై జరిగిన ఒప్పందం చాలా ముఖ్యమైనది. ఏర్పాటు చేస్తున్న సంస్థ ద్వారా 10వేల మందికి ఉపాధి లభిస్తుంది. తిమ్మాపూర్‌లో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టడం చాలా సంతోషం. భవిష్యత్‌లో మరో రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వెయ్యికోట్ల పెట్టుబడులు చాలా మంచి పరిణామం."
- కేటీఆర్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి
హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ కంపెనీ ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో 50 శాతంపైగా మహిళలకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సంస్థ ఉపయోగానికి స్థానిక వనరులు వాడుకోవాలని సూచించారు. ప్రస్తుత ప్లాస్టిక్ వ్యర్థాలు సమస్యగా మారాయన్న కేటీఆర్.. పర్యావరణానికి హితమైన వనరులనే వినియోగించాలని కోరారు. ఉత్తర, దక్షిణ భారత్‌కు వారధిగా తెలంగాణ ఉందన్న మంత్రి కేటీఆర్....తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాలకు త్వరగా ఉత్పత్తులు పంపవచ్చని చెప్పారు. ప్యాకేజింగ్ రంగంలోనూ హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ సూచించారు.
సిద్దిపేటలో తమ ప్లాంట్ నిర్మితమై 2023 నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తుందని సంస్థ సీఈఓ గర్గ్ తెలిపారు. శీతల పానీయాలు, వాటర్ ప్యాకెట్లు, తదితర వాటిని ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న పరిశ్రమల్లో 45 నుంచి 65 శాతం మంది మహిళలకు ఉపాధిలో అవకాశం కల్పిస్తున్నామని ఏర్పాటయ్యే ప్లాంట్‌లో కూడా అదే విధంగా అవకాశం కల్పిస్తామని తెలిపారు. తమ సంస్థకు స్థలం కేటాయించడంతో పాటు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు మంచి వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. ఈ పరిశ్రమపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పర్యావరణానికి హాని కలగకుండా ప్లాంట్‌లో బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా తమ సిబ్బంది సహకారంతో 25లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నట్లు హెచ్‌సీసీబీ సీఈఓ గర్గ్ పేర్కొన్నారు.