RSS: సత్యాన్ని నిరంతరం అన్వేషించడమే హిందూత్వమని ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రచయిత రాంమాధవ్ అన్నారు. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా హిందూత్వం ఉందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. హిందుత్వంపై పరిపూర్ణ అవగాహన కల్పించేలా తాను ‘ది హిందుత్వ పారడైమ్’ పుస్తకాన్ని రచించినట్లు ఆయన తెలిపారు. ఆ పుస్తక పరిచయంతోపాటు త్వరలో విడుదల చేయనున్న మరో రచన ‘పార్టిషన్డ్ ఫ్రీడమ్’ కవర్ పేజీ ఆవిష్కరణ మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జరిగింది. సాహితీ సుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాంమాధవ్ మాట్లాడుతూ.. ‘పార్టిషన్డ్ ఫ్రీడమ్’ పుస్తకంలో తాను దేశవిభజన గురించి రాసినట్లు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో సమూల మార్పులను గాంధీజీ ఆకాంక్షించారని, గ్రామసీమల్లో పేదరికం సమూలంగా అంతం కావాలని అభిలషించారని, సంపూర్ణ విద్యాభివృద్ధిని చూడాలని కలలు కన్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు రావాలంటే.. తొలుత కాంగ్రెస్ను రద్దుచేయాలని గాంధీజీ ఆనాడే చెప్పారని, అప్పుడా పనిచేయని కాంగ్రెస్.. ఇప్పుడు దేశంలో తమపార్టీని పూర్తిగా రద్దుచేసే దిశగా అడుగులు వేస్తోందని ఎద్దేవా చేశారు.