ఏ ఊరికి వెళ్లినా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, శానిటైజర్లతో చేతులు తరుచూ శుభ్రం చేసుకుంటూ, మాస్కులు ధరించాలనే ప్రచారం వినిపిస్తోంది. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా హిందూపురం ప్రజలను రానివ్వొద్దంటూ.. ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో వైరస్ బాధితులు ఎక్కువగా హిందూపురానికి చెందిన వారు కావడమే ఇందుకు కారణం. దీనిపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటున్నా... ప్రచారమే కర్ణాటకతో మానవీయ సంబంధాలను దూరం చేస్తోంది. తమ గ్రామాలకు హిందూపురం ప్రజలు ఎవరూ రావద్దంటూ కర్ణాటక రాష్ట్ర అధికారులు సరిహద్దు గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు.
ఏ వస్తువు కొనాలన్నా..
అనంతపురం జిల్లా హిందూపురం సరిహద్దులో కర్ణాటక రాష్ట్రం ఉంది. ఆ జిల్లాలో ప్రజలకు బంధుత్వాలన్నీ ఎక్కువగా కర్ణాటక వారితోనే ఉంటాయి. వివాహ బంధుత్వాలు మొదలు, ఏ వస్తువు కొనాలన్నా కర్ణాటకలోని బెంగళూరుకో, తుంకూరు జిల్లా కేంద్రానికో వెళ్తారు. హిందూపురం పట్టణం దాటి వెళితే ఆంధ్ర ప్రజలంతా కన్నడ భాష మాట్లాడేవారే. ఇంతగా కర్ణాటక రాష్ట్రంతో సంబంధాలున్నా.. ఆయా గ్రామాల్లో ప్రవేశం లేదు.