భాగ్యనగరంలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో రహదారులు వాగులను తలపిస్తున్నాయి. నగరంలోని జంట జలశయాలకు అధికంగా వరద నీరు వస్తోంది. హిమాయత్ సాగర్ జలశయానికి భారీగా వరద నీరు రావడంతో జలమండలి అధికారులు రిజర్వాయర్ మరో రెండు గేట్లను ఒక అడుగు పైకి ఎత్తి దిగువకు వరద నీటిని వదులుతున్నారు.
మొత్తం 4 గేట్ల ద్వారా 1400 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీకి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ గండిపేట పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కురుస్తుండడంతో ఇవాళ మరో మూడు వరద గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి నాలుగు గేట్ల ద్వారా 960 క్యూసెక్యుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.