Hilly areas in Vijayawada: ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల నుంచి విజయవాడ వచ్చే వారి సంఖ్య ఎక్కువే. అలాంటి వారు పెరుగుతున్న అద్దెలను తట్టుకోలేక.. కొండ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. జోరుగా వర్షాలు కురిస్తే కొండచరియలు విరిగి ఇళ్లపై పడతాయని తెలిసినా గుణదల, మొగల్‌రాజపురం, వన్‌టౌన్, గాంధీ పర్వతం, సొరంగ మార్గం, కబేళా వంటి ప్రాంతాల్లో లక్షల మంది నివాసం ఉంటున్నారు. వర్షా కాలంలో వీరంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. క్రీస్తురాజుపురం, చెరువు సెంటర్, విద్యాధరపురం, చిట్టినగర్ కొండ ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కొండపైకి వెళ్లాలంటే మెట్ల దారి కూడా లేని పరిస్థితి.
"క్రీస్తురాజు పురం, సొరంగం, చెరువు సెంటర్, విద్యాధరపురం, చిట్టినగర్ కొండ ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ నివసించే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో బతుకుతున్నాం. ఇవే ప్రాంతాల్లో గతేడాది కొండ చరియలు విరిగిపడి చాలా ప్రమాదాలు సంభవించాయి. అధికారులు తూతూమంత్రంగా వచ్చి హడావిడి చేయడం తప్ప, నియంత్రణా చర్యలు ఇప్పటికి తీసుకోలేదు" -స్థానికులు
ఏవైనా ఘటనలు జరిగినప్పుడు అధికారులు హడావిడి చేయడం తప్ప.. నియంత్రణా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. దోమల జోరుతో విష జర్వాల ప్రబలుతున్నాయి. కొండ చరియలు విరిగిపడకుండా కంచెను ఏర్పాటు చేయాలనికోరుతున్నారు.