Vijayawada Loyola College Hijab Issue : ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని లయోల కళాశాలలో హిజాబ్ వివాదం తలెత్తింది. హిజాబ్ వేసుకొచ్చామనే కారణంతో కాలేజీ యాజమాన్యం లోనికి అనుమతివ్వడంలేదని విద్యార్థినులు ఆరోపించారు. ఫస్ట్ ఇయర్ నుంచి తాము హిజాబ్‌తోనే కాలేజీకి వస్తున్నామని తెలిపారు. కాలేజీ ఐడీ కార్డులో కూడా తాము హిజాబ్‌తోనే ఫొటో దిగామని పేర్కొన్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడెందుకు ఆపుతున్నారంటూ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యం విద్యార్థినులను లోనికి అనుమతివ్వకపోవడంతో.. ముస్లిం పెద్దలు కళాశాల వద్దకు చేరుకున్నారు.
Vijayawada Loyola College Hijab Issue : విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం.. - తెలంగాణ వార్తలు
![Vijayawada Loyola College Hijab Issue : విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం.. Loyola College Hijab issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14490336-659-14490336-1645098106274.jpg)
10:21 February 17
హిజాబ్ వేసుకొస్తే యాజమాన్యం రానివ్వట్లేదన్న విద్యార్థినులు
లయోల కళాశాల వద్దకు చేరుకున్న పోలీసులు ప్రిన్సిపల్‌తో హిజాబ్ వివాదంపై చర్చించి సమస్యను పరిష్కరించారు. విద్యార్థులను తరగతుల్లోకి పంపారు. హిజాబ్ తీసివేసి రమ్మని కళాశాల యాజమాన్యం విద్యార్థినులకు చెప్పిందని.. తెదేపా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఫతుల్లా అన్నారు. ఈ కళాశాల కాదు.. ఏపీలోని ఏ కళాశాలలో ఇలా జరిగినా తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు జరుగకుండా.. ఏపీ ముఖ్యమంత్రి, డీజీపీ చర్యలు తీసుకోవాలని ఫతుల్లా డిమాండ్ చేశారు.
హిజాబ్ వివాదంపై స్పందించిన కళాశాల యాజమాన్యం...
కళాశాల నిబంధనల ప్రకారం హిజాబ్‌కు అనుమతి లేదని ప్రిన్సిపల్ కిషోర్ అన్నారు. అయినప్పటికీ ఇద్దరు విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారని తెలిపారు. తరగతి గదికి రౌండ్‌కు వెళ్లినప్పుడు గమనించి.. కళాశాలకు హిజాబ్ ధరించి వస్తున్నారేంటని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. కళాశాలలో చేరేటప్పుడే.. విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల నిబంధనలపై సంతకం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కలెక్టర్ ఆదేశాలతో విద్యార్థినులను తరగతి గదిలోనికి అనుమతించామని తెలిపారు. రేపటి నుంచి హిజాబ్ ధరించిన విద్యార్థినులను.. తరగతి గదుల్లోకి అనుమతించాలా వద్దా అనేది నిర్ణయిస్తామని ప్రిన్సిపల్ కిషోర్ అన్నారు.
ఇదీ చదవండి :ముదిరిన హిజాబ్ వివాదం.. మూడు రోజులు విద్యాసంస్థలు బంద్