తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​: విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేనా? - Andhra Pradesh Education system news

ఏపీలో కరోనా తీవ్రత పెరుగుతున్నందున విద్యాసంస్థల నిర్వహణపై తర్జనభర్జన సాగుతోంది. కళాశాలల్లో కరోనా కేసులు పెరుగుతుండటం తల్లిదండ్రుల్ని కలవరపెడుతోంది. మరోవైపు విద్యా సంవత్సరం నష్టపోనివ్వమని స్పష్టం చేస్తున్న ఉన్నత విద్యా మండలి... ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. త్వరలోనే వీసీలతో సమావేశం నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోనుంది.

education in AP
ఏపీలో విద్యాసంస్థల నిర్వహణపై తర్జనభర్జన

By

Published : Apr 24, 2021, 5:25 PM IST

ఏపీలో కరోనా తీవ్రత విద్యార్థులకు సంకటంగా మారింది. ఇప్పటికే 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది, ఇంటర్ పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండగా.. కొన్ని చోట్ల వసతి గృహాలను మూసివేశారు. తరగతుల నిర్వహణ ఎలా అనే సందిగ్ధత నెలకొంది.

5 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

మరోవైపు.. ఇంటర్ థియరీ పరీక్షలు మే 5న ప్రారంభమై 23తో ముగుస్తాయి. ఈ ఏడాది 10,66,493 మంది ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో 20 మంది విద్యార్థులకు ఒక్కో గది చొప్పున కేటాయిస్తారు. కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉండే విద్యార్థుల కోసం థియరీ పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో విధులకు హాజరయ్యే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందించనున్నారు.

త్వరలోనే వీసీలతో సమావేశం

ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య కోసం కళాశాలల్లో చేరాల్సి ఉన్నందున షెడ్యూల్ ప్రకారం విద్యాసంవత్సరం పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వివిధ ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నందున వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యాసంవత్సరం కొనసాగిస్తామని స్పష్టం చేస్తోంది. కరోనా తీవ్రత పెరిగినా తరగతలు ఎలా కొనసాగించాలి, పరీక్షలు ఎలా నిర్వహించాలనేదానిపై త్వరలోనే వీసీలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది.

పరీక్షలు, మూల్యాంకనంపై కసరత్తు

స్వయం ప్రతిపత్తి కళాశాలలకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ద్వారానే పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం చేయించే ప్రక్రియపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) స్వయం ప్రతిపత్తి హోదా ఇచ్చినందున ఈ వ్యవహారంపై ఆ సంస్థకు లేఖ రాయడమా..? లేక వర్సిటీల ద్వారానే నేరుగా పరీక్షలు నిర్వహించేలా చూడటమా అని యోచిస్తోంది.

ఉన్నత విద్యకు సంబంధించి ఈ విషయం గత కొన్నిరోజులుగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 109 స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సాధారణ డిగ్రీ కళాశాలలు 54 ఉండగా.. ఇంజినీరింగ్‌ 55 ఉన్నాయి. డిగ్రీకి సంబంధించి ఎక్కువ కళాశాలలు ప్రభుత్వ, ఎయిడెడ్‌లోనే ఉన్నాయి. ప్రైవేటులో ఒకటి మాత్రమే ఉంది. డిగ్రీ కళాశాలలు ప్రభుత్వానివే అయినందున వీటికి వర్సిటీలే నిర్వహిస్తాయా..? లేక ఇంజినీరింగ్‌కే పరిమితమవుతారా..? అనేదానిపైనా అస్పష్టత నెలకొంది.

ఏపీలో విద్యాసంస్థల నిర్వహణపై తర్జనభర్జన

ఇదీ చదవండి:ఆస్పత్రుల్లో కరోనా కిట్ల కొరత.. పరీక్షల కోసం బారులు తీరిన జనాలు

ABOUT THE AUTHOR

...view details