నిర్మాణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో వీటిలో పనిచేస్తున్న చాలా మంది అకస్మాత్తుగా నిరుద్యోగులుగా మారారు. మొన్నటి వరకూ రూ.15 - రూ.20 వేలు సంపాదించిన వాళ్లు రోడ్డున పడ్డారు. నిస్సహాయ స్థితిలో కడుపు నింపుకొనేందుకు వారిలో చాలా మంది కూలీలుగా మారారు. స్వగ్రామాలకు వెళ్లి ఉపాధి హామీ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొత్తగా కూలీలుగా నమోదవుతున్న వారిలో మూడొంతుల మంది ఉన్నత విద్యావంతులేనని అధికారులు చెబుతున్నారు.
సంగారెడ్డిలో అత్యధికం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 25 వరకూ హైదరాబాద్ పక్కనే ఉన్న సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 18,551 మంది ఉపాధి కూలీలుగా నమోదు చేసుకున్నారు. 17,238 మందితో రంగారెడ్డి జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో 536 మంది, మంచిర్యాల జిల్లాల్లో 840 మంది నమోదు చేసుకున్నారు.
ఉపాధ్యాయుడి దైన్యం
నల్గొండ జిల్లా సింగారానికి చెందిన వంపు మహేందర్‌ది వ్యవసాయ కుటుంబం. ఎంఏ, బీఈడీ పూర్తిచేసి స్థానిక పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో బతుకు భారంగా మారింది. పొట్టకూటి కోసం ‘ఉపాధి కూలీ’గా మారారు.