పరిశ్రమ మూసివేతకు సంబంధించి జీహెచ్ఎంసీ నోటీసుల తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏమి ఉల్లంఘించారనే విషయాన్ని నోటీసుల్లో ప్రస్తావించకుంటే ఎలా అని ప్రశ్నించింది. హైదరాబాద్ శాస్త్రిపురంలో గోడౌన్‌ను మూసివేయాలని పేర్కొంటూ జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ యజమాని దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది.
వ్యర్థ పదార్థాలు వేస్తున్నారని.. కట్టెలు కాలుస్తున్నారని నోటీసులు జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిఫార్సుల మేరకు నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే సరైన కారణాలను ప్రస్తావించకుండా నోటీసు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. లైసెన్సు లేదని నోటీసు ఇచ్చారా? లేక మాస్టర్ ప్లాన్ ఉల్లంఘించారనా? పరిశ్రమ నిర్వహిస్తున్నారనా? అని ధర్మాసనం ప్రశ్నించింది.